తెలంగాణ

telangana

ETV Bharat / state

పీఎం ఇన్నోవేషన్‌ అవార్డు జాబితాలో మన కలెక్టరమ్మ

నారాయణపేట జిల్లా కలెక్టర్‌ దాసరి హరిచందన ప్రతిష్ఠాత్మక ప్రధానమంత్రి ఇన్నోవేషన్‌ అవార్డు-2020 జాబితాలో చోటుదక్కించుకున్నారు. 2018లో బెటర్‌ ఇండియా పత్రిక ప్రకటించిన 10 మంది ప్రభావశీల ఐఏఎస్‌లలోనూ హరిచందన చోటు దక్కించుకున్నారు.

By

Published : Sep 6, 2020, 7:24 AM IST

narayanpet collector
పీఎం ఇన్నోవేషన్‌ అవార్డు జాబితా నారాయణపేట కలెక్టర్‌ హరిచందన

కొత్త జిల్లాకు రెండో కలెక్టర్‌గా అడుగుపెట్టిన ఆమె పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. సమస్యల పరిష్కారానికి వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.. బాధ్యతలు చేపట్టిన అనతికాలంలోనే జిల్లా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెడుతూ మన్ననలు అందుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రతిష్ఠాత్మక ప్రధానమంత్రి ఇన్నోవేషన్‌ అవార్డు-2020 జాబితాలో చోటుదక్కించుకున్నారు నారాయణపేట జిల్లా కలెక్టర్‌ దాసరి హరిచందన. ప్రజల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు కృషిచేసే జిల్లా పాలనాధికారులకు పీఎం ఇన్నోవేషన్‌ అవార్డు అందిస్తారు. 2018లో బెటర్‌ ఇండియా పత్రిక ప్రకటించిన 10 మంది ప్రభావశీల ఐఏఎస్‌లలోనూ హరిచందన చోటు దక్కించుకున్నారు.

తక్కువ సమయంలోనే..

2010 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన హరిచందన జీహెచ్‌ఎంసీలో అదనపు కమిషనర్‌గా పని చేస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 3వ తేదీన నారాయణపేట జిల్లా కలెక్టర్‌గా బదిలీపై వచ్చారు. వెనుకబడిన జిల్లాగా పేరొందిన నారాయణపేటలో తక్కువ సమయంలో పలు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రధానంగా మహిళా అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించారు. మహిళాల ఆత్మగౌరవం కోసం ‘మొబైల్‌ షీ టాయిలెట్‌’ను కోస్గి పురపాలికలో ఏర్పాటు చేశారు. ఈ నిర్ణయంపై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ నుంచి అభినందనలు పొందారు. రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో ఇలాంటి టాయిలెట్లు ఏర్పాటుచేయాలని మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు.

జీహెచ్‌ఎంసీలోనూ..

జీహెచ్‌ఎంసీలో అదనపు కమిషనర్‌గా పని చేసిన సమయంలోనూ హరిచందన పలు సంస్కరణలు తీసుకొచ్చారు. చెరువుల్లో వ్యర్థాల తొలగింపునకు చర్యలు తీసుకోవడంతోపాటు అవి అన్యాక్రాంతం కాకుండా చూశారు. పార్కులను సైతం కబ్జాల నుంచి కాపాడారు. పార్కుల్లో పంచతంత్ర కథల థీమ్‌తో అలంకరణ చేపట్టారు. జీహెచ్‌ఎంసీలో మూలన పడి ఉన్న వాహనాల ద్వారా ఉపకరణాలను తయారు చేయించి పార్కుల్లో అలంకరించే విధంగా చేశారు.

కొవిడ్‌ కాలంలోనూ మహిళలకు ఉపాధి

ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘వి హబ్‌’లో ఈ ఏడాది నారాయణపేట జిల్లాకు చెందిన 8 మంది మహిళలకు చోటుదక్కేందుకు హరిచందన కృషి చేశారు. దేశవ్యాప్తంగా 30 మంది మాత్రమే ఈ శిక్షణకు ఎంపికయ్యారు. కొవిడ్‌ నేపథ్యంలో జిల్లాలో పలు కుటుంబాలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డాయి. ఈ నేపథ్యంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా నాణ్యమైన మాస్కులు తయారు చేసేలా మహిళా సంఘాలను కలెక్టర్‌ ప్రోత్సహించారు. హైదరాబాద్‌కు చెందిన డిజైనర్ల సలహాలు, సూచనలు ఇప్పించారు. 6,970 మహిళల సంఘాల ద్వారా 4,31,608 మాస్కులను తయారు చేశారు. పోచంపల్లి, నారాయణపేట కాటన్‌ వస్త్రంతో తయారు చేసి హైదరాబాద్‌లోని ప్రముఖ సంస్థలు, వ్యక్తులకు సరఫరా చేశారు. మహిళా సంఘాలు తక్కువ వ్యవధిలో రూ.50 లక్షల వరకు వ్యాపారం చేసి.. ఉపాధి పొందాయి.

ఇవీచూడండి:సులభతర వాణిజ్య విభాగంలో రాష్ట్రానికి మూడో స్థానం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details