నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికలో తెరాస అభ్యర్థి కోటిరెడ్డి గెలుపు Nalgonda MLC Kotireddy : ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస విజయదుందుభి మోగించింది. 9 జిల్లాల్లో 12 స్థానాలకు పోటీ జరగ్గా.. ఆరింటిని ఏకగ్రీవం చేసుకున్న తెరాస.. పోలింగ్ జరిగిన 6 స్థానాలనూ గెలుచుకుని తిరుగులేని విజయం సాధించింది.
TRS Wins Nalgonda MLC : నల్గొండలోనూ కారు దూసుకెళ్లింది. ఎమ్మెల్సీ స్థానంలో తెరాస అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి గెలుపొందారు. నల్గొండలో మొత్తం ఏడుగురు పోటీలో నిలవగా.. 1271 మంది ఓట్లు వేశారు. తెరాసకు 917, స్వతంత్రులు నగేశ్‌కు 226, లక్ష్మయ్యకు 26 ఓట్లు పోలయ్యాయి. వెంకటేశ్వర్లు 6, రామ్ సింగ్ 5 ఓట్లతో సరిపెట్టుకున్నారు. మొత్తం 50 చెల్లని ఓట్లు పోలయ్యాయి.
"జిల్లా మంత్రి ఆధ్వర్యంలో.. ఎమ్మెల్యేల సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తాను. నా దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తాను. తోటి ప్రజాప్రతినిధులతో కలిసి జిల్లాను ప్రగతి పథంలో ముందుకెళ్లేలా చర్యలు తీసుకుంటాను. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నాపట్ల ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. నా గెలుపునకు కారణమైన ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు."
- కోటిరెడ్డి, నల్గొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ
12 స్థానాల్లో ఆరింటిన తెరాస ముందే ఏకగ్రీవం చేసుకుంది. నిజామాబాద్ నుంచి కల్వకుంట్ల కవిత, మహబూబ్‌నగర్ జిల్లాలో కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రంగారెడ్డి జిల్లాలోని రెండు స్థానాలకు పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్‌రాజు సహా వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. మొత్తంగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన 12 స్థానాలకు తెరాస కైవసం చేసుకుంది.