మిర్యాలగూడ వ్యాపారి మారుతీరావు మృతి కేసులో సైఫాబాద్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని భావించిన పోలీసులు గదిలో దొరికిన లేఖను పరిగణలోకి తీసుకున్నారు. ఆ చేతిరాత మారుతీరావుదేనని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారని పోలీసులు వెల్లడించారు.
ఆ సూసైడ్నోటు మారుతీరావు రాసిందేనా? - మారుతీరావు ఆత్మహత్య కేసులో దర్యాప్తు ముమ్మరం
మిర్యాలగూడ వ్యాపారి, ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు అనుమానాస్పద మృతి కేసులో సైఫాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మారుతీరావు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని ప్రాథమికంగా భావించిన పోలీసులు... గదిలో దొరికిన చీటిని పరిగణలోకి తీసుకుంటున్నారు.
మారుతీరావు శరీరం నీలం రంగులోకి మారడం వల్ల పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు చూచాయగా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. పోస్టుమార్టం నివేదిక రావడానికి కనీసం రెండు వారాల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
మారుతీరావు ఈ నెల 7న మధ్యాహ్నం 3 గంటల సమయంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి బయల్దేరాడని, అక్కడే పురుగుల మందును.. మంచినీళ్ల సీసాలో కలుపుకుని వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ ఆర్యవైశ్య భవన్లో నీళ్ల సీసా దొరకకపోవడం వల్ల దాని కోసం ఆరా తీస్తున్నారు. ఉదయమే చెత్త సేకరించే వాళ్లు నీళ్ల సీసా తీసుకెళ్లి ఉండొచ్చనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
- ఇదీ చూడండి:మారుతీరావు అంత్యక్రియలకు అమృత దూరం...!