తెలంగాణ

telangana

ETV Bharat / state

Inter First Year Exams 2021: అధికారుల తప్పులు.. విద్యార్థులకు తిప్పలు - Management errors in inter examinations

ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షల నిర్వహణలో లోపాలు బోర్డు నిర్లక్ష్యాన్ని చెప్పకనే చెప్పాయి. ప్రైవేటు కళాశాలలపై అధికారులకు అజమాయిషీ లేదని, కనీస వివరాలు కూడా పరిశీలించడం లేదనే విషయమూ స్పష్టమైంది. తొలిరోజు సోమవారం సంస్కృతం, తెలుగు, హిందీ, ఉర్దూ, అరబిక్‌ పరీక్షలు జరిగాయి. మొత్తం 4,59,240 మందికిగానూ 4,29,177 మంది హాజరయ్యారు. 30,063 మంది(6.5 శాతం) పరీక్షలు రాయలేదు.

Inter First Year Exams 2021
Inter First Year Exams 2021

By

Published : Oct 26, 2021, 7:03 AM IST

ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల నిర్వహణలో లోపాలు బోర్డు నిర్లక్ష్యాన్ని బయటపెట్టాయి. కొన్ని ప్రాంతాల్లో పరీక్ష ఆలస్యంగా ప్రారంభం కాగా.. మరోప్రాంతంలో ఓ విద్యార్థి హాల్​టికెట్​పై పరీక్షా కేంద్రం చిరునామా తప్పుగా చూపించింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సినాప్స్‌ కళాశాలలోని కొన్ని గదుల్లో పరీక్ష పత్రాలను అరగంట ఆలస్యంగా (9.30 గంటలకు) అందించారు. తమకు పోటీగా ఉన్న కళాశాల విద్యార్థులున్న గదుల్లో పరీక్ష పత్రాల పంపిణీని ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేంద్రంలో కొందరు విద్యార్థులను 9.15 గంటల వరకూ అనుమతించినట్లు తోటి విద్యార్థులు తెలిపారు. దీనిపై తల్లిదండ్రులు పరీక్ష కేంద్రం చీఫ్‌ సూపరింటెండెంట్‌ రవిశంకర్‌కు ఫిర్యాదు చేశారు. కళాశాలల మధ్య ఉన్న పోటీతో విద్యార్థులకు అన్యాయం చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయాన్ని జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి దస్రూనాయక్‌ దృష్టికి ‘ఈనాడు’ తీసుకెళ్లగా సినాప్స్‌ కళాశాలలో పరీక్ష పత్రం ఆలస్యంగా ఇచ్చిన విషయమై ఫిర్యాదులు అందాయని, దీనిపై విచారణ జరిపిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ప్రశ్నపత్రాలు ఆలస్యంగా ఇచ్చినట్టు విద్యార్థులు ఆరోపించారు.

పాత చిరునామాతో అవస్థలు

నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లోని మధుమలాంచ జూనియర్‌ కళాశాల పరీక్ష కేంద్రం చిరునామాను హాల్‌టికెట్లపై శక్కర్‌నగర్‌ అని ముద్రించారు. దాంతో విద్యార్థులు అక్కడికి వెళ్లారు. వాస్తవానికి మూడేళ్ల కిందటే ఈ కళాశాల ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రాంగణంలోకి మారింది. దీంతో విద్యార్థులు అక్కడికి పరుగులు తీశారు. ఈ విషయాన్ని కళాశాల యంత్రాంగం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు.

నిమిషం ఆలస్యమయిందనిగంట తరవాత అనుమతి

మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌లోని పరీక్ష కేంద్రానికి అయిదుగురు విద్యార్థులు ఉదయం 9 గంటలకు ఒక్క నిమిషం ఆలస్యంగా రావడంతో వారిని నిర్వాహకులు అనుమతించలేదు. ఎంపీటీసీ సభ్యుడు గౌస్‌, స్థానిక నాయకులు కోరినా ససేమిరా అన్నారు. దీంతో కాంగ్రెస్‌ నాయకులు ఆందోళన చేపట్టారు. 10 గంటల సమయంలో శిక్షణ ఎస్సై శ్రవణ్‌కుమార్‌ పరీక్ష నిర్వాహకులతో మాట్లాడటంతో ఎట్టకేలకు విద్యార్థులను హాలులోకి పంపించారు.

ABOUT THE AUTHOR

...view details