BRS Atmiya Sammelanam in Telangana : బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనాలు రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఈ సమావేశాలను మే నెలాఖరు వరకు కొనసాగించాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తెలిపారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి అంటే ఏప్రిల్ 27 నాటికి పూర్తి చేయాలని పార్టీ శ్రేణులకు గతంలోనే నిర్ణయించారు. ఇది ఎన్నికల సంవత్సవం కాబట్టి ఆత్మీయ సమ్మేళనాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశించారని కేటీఆర్ వెల్లడించారు. అందుకే ఆత్మీయ సమ్మేళనాల గడువును పొడిగించినట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులతో సమన్వయం చేసుకోవాలని జిల్లా ఇన్ఛార్జీలను మంత్రి కేటీఆర్ ఆదేశించారు.
BRS Atmiya Sammela news : మరోవైపు బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు కామారెడ్డి, జోగులాంబ గద్వాల,యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాల్లో ఘనంగా నిర్వహించారు. నల్గొండ, మునుగోడులో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా మంత్రి జగదీశ్‌రెడ్డి హాజరయ్యారు. దేశంలో బీజేపీకు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ మాత్రమేనని మంత్రి అన్నారు విపక్షాల మాయలో పడి సంక్షేమ ప్రధాత కేసీఆర్‌ను దూరం చేసుకోవద్దని కార్యకర్తలకు సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని వివరించారు.
"నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో కేవలం ఆరుగంటలు మాత్రమే కరెంటు ఇస్తున్నారు. ప్రతి మోటారుకు మీటరు ఉంది. ప్రతి నెల రైతులు రూ. 1000 నుంచి రూ.5000 బిల్లులు రైతులు కడుతున్నారు. గుజరాత్లో రైతుబంధు లేదు. కాంగ్రెస్ పాలిస్తున్న రాజస్థాన్‌లో ఇవన్నీ లేవు." - జగదీశ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి