ఒక్క ఆలోచనతో మారిన పాఠశాల పరిస్థితి నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం పెనిమిళ్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సిబ్బంది..తమ దీర్ఘకాలిక సమస్యకు వారు కనుగొన్న పరిష్కారం.. ఆ బడికి ప్రత్యేకత తీసుకొచ్చింది. మౌలిక వసతులు లేని ఈ పాఠశాలలో సమస్యలు తీర్చేందుకు ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం సరికొత్త ఆలోచనను ఆవిష్కరించింది.
అంతర్జాలంలో శోధించి..
ఉపాధ్యాయులు.. విద్యార్థుల సహాయంతో అంతర్జాలంలో శోధించి ప్లాస్టిక్ వ్యర్థాలతో మూత్ర శాలలు ఏర్పాటు చేశారు. 20 లీటర్ల నీటి బాటిల్ తీసుకొని దానికి మధ్యలో సగభాగం కోసి ఆ బాటిల్‌ను లీటర్ బాటిల్‌తో జాలి లాగా అనుసంధానం చేసి దానికి పైపులతో అతికించి అన్ని బాటిల్స్‌కి ఒకదానితో ఒకటి అనుసంధానం చేశారు. ఇలా మొత్తం ఏడు బాటిల్స్‌తో ఏడు మూత్రశాలలు తయారు చేశారు. వీటికి కేవలం 1500 నుంచి 2000 వరకు మాత్రమే ఖర్చయింది. ఇలా ఏర్పాటు చేసి కూడా రెండేళ్లు పూర్తవుతుంది. ఇప్పటివరకు ఎలాంటి డ్యామేజ్ అవ్వలేదు, దుర్వాసన రాలేదు. పిల్లల్లో సృజనాత్మకత పెంపొందించేందుకు విద్యార్థులతో ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నామని ఉపాధ్యాయులు తెలిపారు. ఇదే కాక ప్రైవేటుకు ధీటుగా ఇక్కడి విద్యార్థులు పదో తరగతిలో ప్రతి ఏడు అత్యధిక ఉత్తీర్ణత సాధించి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు.
సుందర వనంగా పాఠశాల:
గతంలో మూత్రశాలలు లేక ఇబ్బందులకు గురయ్యే వారమని ఇప్పుడు రెండేళ్లుగా ఇబ్బంది తీరిందని విద్యార్థులు అంటున్నారు. స్వచ్ఛభారత్‌కు ఆదర్శంగా మూత్రశాలలను తామే శుభ్రంగా ఉంచుకుంటామన్నారు. ఇదే దాతల సహాయంతో డిజిటల్ క్లాస్ రూమ్, వాటర్ ఫిల్టర్, ప్రదర్శనశాల, కంప్యూటర్ గదులు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఇక పాఠశాలలో అడుగు పెడితే ఆ ప్రాంగణం మొత్తం పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా ఉంటుంది. పాఠశాల సుందర వనంగా విద్యార్థులు తీర్చిదిద్దారు. ఇలా తీర్చిదిద్దడానికి విద్యార్థులు, ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉంది. పాఠశాలలోని ప్రతి మొక్కను ఒక్కో విద్యార్థి దత్తత తీసుకొని పెంచుతున్నారు. మొక్కకు దత్తత తీసుకున్న విద్యార్థి పేరు ఆ మొక్క శాస్త్రీయ నామంతో నెంబర్ ప్లేట్ మీద రాసి ఉంటుంది. ఇలా ప్రతి మొక్కను విద్యార్థులు ఎంతో అపురూపంగా పెంచుకుంటూ పోషిస్తున్నామని విద్యార్థులు పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలు.. ప్రైవేట్‌కు ధీటుగా నడవడంతో పాటు జిల్లాలోని అన్ని స్కూళ్లకు ఇక్కడి విద్యార్థులు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలాంటి పాఠశాలలు మరిన్ని రావాలని కోరుకుంటున్నారు.
ఇవీ చూడండి:ప్లాస్టిక్‌పై సమరం: 'చెత్త కేఫ్' ఆలోచనకు ప్రశంసలు