Telangana Assembly Elections Congress 2023 : శాసనసభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్తిస్థాయి ప్రచార కమిటీని ఏఐసీసీ ప్రకటించింది. ఇప్పటికే ప్రచార కమిటీ ఛైర్మన్‌గా మాజీ ఎంపీ మధుయాస్కీ కొనసాగుతుండగా... ఆయనను అలాగే కొనసాగిస్తూనే పూర్తిస్థాయి కమిటీ సభ్యులను, ప్రత్యేక ఆహ్వానితుల జాబితాను ప్రకటించింది. కమిటీ ఛైర్మన్‌గా మధుయాస్కీతో పాటు ఇటీవల పార్టీలో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని సహఛైర్మన్‌గా కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. అలాగే.. కన్వీనర్‌గా సయ్యద్ అజ్ముత్తుల్లా హుస్సేనీను నియమించి ముస్లిం కమ్యూనిటీకి అవకాశం కల్పించింది. మరో 37 మందిని కమిటీ కార్యనిర్వహక కమిటీ సభ్యులను, మరికొందరిని ప్రత్యేక ఆహ్వానితులుగా ఏఐసీసీ ప్రకటించింది.
Telangana Congress Election Campaign Committee : మరోవైపు రాష్ట్రంలో 17 పార్లమెంటు నియోజక వర్గాల వారీగా 17మందిఏఐసీసీ పర్యవేక్షకులను కాంగ్రెస్ నియమించింది. త్వరలో ఎన్నికల జరగనున్న రాష్ట్రాలకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న అంశంపై రెండ్రోజుల క్రితం సుదీర్ఘంగా చర్చించిన కాంగ్రెస్ అధిష్టానం... ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటు నియోజక వర్గాల వారీగా ముందస్తుగా పర్యవేక్షణకులను నియమించడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయటం... నాయకుల మధ్య సమన్వయం తెచ్చేందుకు దోహదం చేస్తుందని భావిస్తోంది.
Congress Public Meeting at Kollapur : అటు... కొల్లాపూర్ సభపై కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఖమ్మం జనగర్జన సభకు ఏ మాత్రం తీసిపోకుండా ఈ నెల 20న పాలమూరు ప్రజాభేరి సభను కొల్లాపూర్‌లో నిర్వహించేందుకు పీసీసీ ఏర్పాట్లు చేస్తోంది. సభ నిర్వహణకు అవసరమైన సమన్వయకర్తలను, జన సమీకరణకు అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జిలను వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ నేతృత్వంలో నియమించింది. కొల్లాపూర్‌లో జరిగే ఈ సభావేదికగామాజీ మంత్రి జూపల్లితో పాటు కొందరు బీఆర్ఎస్, బీజేపీ నేతలు కాంగ్రెస్‌లో చేరుతారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.