కాలనీల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అదుపు చేయవచ్చని మంత్రి సీహెచ్ మల్లారెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌లోని ఎన్‌ఐఎన్ కాలనీలో.. దాతల సహకారంతో సుమారు రూ.18లక్షలతో ఏర్పాటు చేసిన 92 సీసీ కెమెరాలను రాచకొండ సీపీ మహేశ్ భగవత్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.
చోరీలు, ఆకతాయిల ఆగడాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని మంత్రి పేర్కొన్నారు. ఆ మేరకు దాతలు ముందుకొచ్చి తమ ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు పాటు పడాలని కోరారు.
సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజల సహకారం తీసుకొని ముందుకు వెళతామని సీపీ మహేశ్ భగవత్ పేర్కొన్నారు. ఆ మేరకు నేర నియంత్రణలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. సీసీ కెమెరాల ఎర్పాటులో ఆదర్శంగా నిలుస్తోన్న మేడిపల్లి సీఐ అంజిరెడ్డి, అతని బృందాన్ని.. మంత్రి, సీపీలు ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి డీసీపీ పీవై.గిరి, ఏసీపీ శ్యాంప్రసాద్‌రావులతో పాటు బోడుప్పల్, ఫీర్జాదిగూడ మేయర్లు జక్కా వెంకట్‌రెడ్డి, సామల బుచ్చిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:సీసీ కెమెరాలతో శాంతిభద్రతలు పటిష్ఠం: హోం మంత్రి