కరోనా నేపథ్యంలో లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన బెస్త కులస్థులను ఆదుకోవాలని గంగపుత్ర మహిళా సంఘం, గంగపుత్ర మహిళా సభ నేతలు కోరారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని చల్మెడ గ్రామంలో గంగపుత్ర మహిళలు బతుకమ్మ ఆడుతూ.. జీవో నెం.6ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. నిరసన తెలిపారు.
నిధులు విడుదల చేయాలి..
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గంగపుత్ర మత్స్య సహకార సొసైటీలకు వెంటనే నిధులు విడుదల చేయాలని కోరారు. ప్రత్యేక తెలంగాణ వస్తే తమ బతుకులు బాగుపడతాయనుకుంటే తెలంగాణ సర్కార్ తమ కులవృత్తిని ఇతర కులస్థులకు ధారాదత్తం చేయడం సరికాదని చెల్మెడ మహిళా సంఘం, గంగపుత్ర మహిళా సభ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళా సభ అధ్యక్షురాలి సహకారంతో..
త్వరలోనే తమ సమస్యల పరిష్కారం కోసం గంగపుత్ర మహిళా సభ అధ్యక్షురాలు అరుణ జ్యోతి బెస్త సహకారంతో భవిష్యత్ కార్యచరణ రూపొందిస్తామన్నారు. ప్రిన్సిపల్ అడ్వైసర్, హైదరాబాద్ జిల్లా సహకార సంఘం ఛైర్పర్సన్ పద్మ బెస్త ఆధ్వర్యంలో నూతన గంగపుత్ర మహిళా సొసైటీల కోసం కృషి చేస్తామన్నారు.
మంత్రికి ఆదేశాలివ్వాలి..
గంగపుత్రుల పాలిట శాపంగా మారిన జీఓ నెం.6ను రద్దు చేసి గంగపుత్రులకు నూతన సొసైటీలు ఏర్పాటు చేయాల్సిందిగా మత్సశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా అధికారులను ఆదేశించాలని సీఎం కేసీఆర్ను కోరారు.
వారి పెత్తనాన్ని అరికట్టాలి..
గంగపుత్రులు ఉన్న చోట వేరే కులస్థులు సభ్యత్యం కోరుతూ తమపై పెత్తనం చెలాయిస్తూ ఘర్షణలకు దిగుతున్నారని.. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మత్ససహకార సంఘాల్లో గంగపుత్రులకే పూర్తిహక్కులు అమలు చేసినప్పుడే నిజమైన బతుకమ్మ, నిజమైన తెలంగాణ అని మహిళలు అన్నారు.
‘చెరువుల్లో పూర్తి హక్కులు ఇస్తేనే.. నిజమైన బతుకమ్మ’