తెలంగాణ

telangana

ETV Bharat / state

రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు: కలెక్టర్​

ప్రభుత్వం మార్గదర్శకాలను అనుసరించి రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని మెదక్​ జిల్లా పాలనాధికారి​ హరీశ్​.. అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్​లో రోడ్డు భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

medak district  collector harish meeting on road  accidents with officers today at collectorate
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు: కలెక్టర్​

By

Published : Mar 17, 2021, 5:26 PM IST

జిల్లాలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని మెదక్​ కలెక్టర్​ హరీశ్​ అధికారులకు సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ.. ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్​లో ఏర్పాటు చేసిన రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

జాతీయ, రాష్ట్ర, గ్రామీణ రహదారుల్లో స్పీడ్ బ్రేకర్లు, స్టడ్స్, బ్లింకర్ లైట్లు, కల్వర్టుల వద్ద రేడియం స్టిక్కర్లు, మలుపుల వద్ద సూచికలు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలోని రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ ప్రధాన రహదారుల్లో ప్రతి ఏటా రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతోందని చెప్పారు. ప్రధానంగా నర్సాపూర్ రోడ్​లో మంబోజిపల్లి, పోతంశెట్టి పల్లి, రాంపూర్, కిష్టాపూర్ ప్రాంతాలలో ప్రమాదాలకు ఎక్కువ అవకాశముందని తెలిపారు. ఈ సంవత్సరం జిల్లాలో 458 రోడ్డు ప్రమాదాలు జరిగాయన్నారు.

కోతులు రాకుండా ఫుడ్​జోన్ల ఏర్పాటు:

మెదక్-నర్సాపూర్ నుంచి హైదరాబాద్ రహదారిలో చాలా మంది వాహనదారులు కోతులకు తినుబండారాలు అందిస్తూ రోడ్లపై వాహనాలు నిలపడం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయని అన్నారు. కోతులు రోడ్డు పైకి రాకుండా నర్సాపూర్ అర్బన్ పార్కులో, గుమ్మడిదల వరకు మూడు, నాలుగు ప్రాంతాలలో ఫుడ్ జోన్లు ఏర్పాటు చేసి.. అక్కడ తినుబండారాలు అందించేలా చూడాలని జిల్లా అటవీ శాఖాధికారులకు సూచించారు. అధికారులు సమష్టిగా ప్రమాదాల నివారణకు చేపట్టవలసిన కార్యక్రమాలను రూపొందించి.. పకడ్బందీగా అమలు చేయాలన్నారు.

వాహనదారులకు అవగాహన కల్పించాలి:

రాత్రి వేళలో ఎదురెదురుగా వచ్చే వాహనాల ఫ్లడ్ లైట్లతో రహదారి కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని.. డివైడర్ మధ్యలో ఏపుగా పెరిగే మొక్కలు నాటాలని కలెక్టర్​ సూచించారు. వాహన వేగ పరిమితి, సీట్ బెల్టు, ఎయిర్ బ్యాగుల పట్ల అవగాహన కల్పించాలన్నారు. తప్పని సరిగా హెల్మెట్, వాహనాలకు ఇరువైపులా అద్దాలు ఉండాలని.. లేకపోతే ఫైన్​ విధించాలని ఆదేశించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఐదు నిమిషాల్లో వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో మెదక్, తూప్రాన్ డీఎస్పీలు కృష్ణమూర్తి, కిరణ్ కుమార్, ఆర్టీఏ అధికారి శ్రీనివాస్ గౌడ్, ఆబ్కారీ శాఖాధికారి శ్రీనివాస్ రెడ్డి, డీఎంహెచ్​వో వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ ఈఈ రామచంద్రారెడ్డి, జాతీయ రహదారుల ప్రతినిధులు, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:ధరణి రైతులకు వరం... పైరవీకారులకు ఆశనిపాతం: సీఎం

ABOUT THE AUTHOR

...view details