తెలంగాణ

telangana

ETV Bharat / state

Palamuru -Rangareddy: ప్రశాంతంగా ప్రజాభిప్రాయ సేకరణ.. ప్రాజెక్టును స్వాగతించిన రైతులు

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రెండో దశ కోసం ఉమ్మడి పాలమూరు జిల్లాలో చేపట్టిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ ప్రశాంతంగా ముగిసింది. మహబూబ్​నగర్ జిల్లా హన్వాడ, నాగర్​కర్నూల్ జిల్లా వెల్దండ, నారాయణపేట జిల్లాల్లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణకు ఆయా జిల్లా కలెక్టర్లు సారథ్యం వహించగా.. రైతులు, ప్రజా సంఘాలు, ప్రజాప్రతినిధులు ఇతరులు హాజరై తమ అభిప్రాయాలు వెల్లడించారు. రెండోదశ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి ఎలాంటి నష్టం లేదని, స్వాగతిస్తున్నామని అభిప్రాయపడ్డారు. భూములు కోల్పోతున్న వారికి... పరిహారం, ప్రభుత్వ వాగ్దానాల అమలుపై స్పష్టత కావాలని ఎక్కువ మంది రైతులు డిమాండ్ చేశారు.

REFERENDUM MEETINGS ON PALAMURU RANGAREDDY LIFT IRRIGATION
REFERENDUM MEETINGS ON PALAMURU RANGAREDDY LIFT IRRIGATION

By

Published : Aug 10, 2021, 8:22 PM IST

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రెండో దశలో కాల్వల నిర్మాణం కోసం ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో కాలుష్య నియంత్రణ మండలి చేపట్టిన పర్యావరణ ప్రజాభిప్రాయసేకరణ ప్రశాంతంగా ముగిసింది. మహబూబ్​నగర్ జిల్లా హన్వాడ, నాగర్​కర్నూల్ జిల్లా వెల్దండ, నారాయణపేట జిల్లా కేంద్రాల్లో ఆయా జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ వేదికల వద్దకు ఆయా మండలాలకు సంబంధించిన రైతులు, ప్రజాసంఘాలు, ప్రజాప్రతినిధులు హాజరై పర్యావరణంపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. నీటి పారుదలశాఖ అధికారులు ప్రాజెక్టు ఆవశ్యకత, ప్రయోజనాలు, ఖర్చు, అంచనాలు, పర్యావరణంపై ప్రభావం ఇతర వివరాలను తెలుగు, ఆంగ్లంలో వివరించారు. హన్వాడ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో జిల్లా కలెక్టర్ వెంకట్రావు ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయసేకరణ జరిపారు. పర్యావరణ పరంగా ఎలాంటి నష్టం లేకపోయినా.. ప్రాజెక్టు ప్రణాళికలను రైతులకు వివరించి ఉంటే బాగుండేదని రైతులు అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టు కింద ఎవరు భూములు కోల్పోతున్నారో, ఎంత పరిహారం ఇస్తున్నారో స్పష్టత ఇవ్వాలని రైతులు కోరారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల రెండోదశ వల్ల పర్యావరణానికి ఎలాంటి నష్టం లేదని, ప్రణాళిక పక్కా ఉందని విశ్రాంత ఇంజినీర్లు అభిప్రాయపడ్డారు.

పరిహారం చెల్లించాకే..

"నా 25 ఎకరాల భూమిని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో కోల్పోయాను. భూనిర్వాసితులకు ఒక్కో కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తానన్న ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చితేనే ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలి. కరివెన జలాశయం కోసం బలవంతంగా భూసేకరణ జరిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. రైతులకు సరైన పరిహారం, నిర్వాసితులకు న్యాయం జరిగిన తర్వాతే భూసేకరణ చేపట్టాలి."- జైపాల్ రెడ్డి, భూత్పూరు మండలం కొత్తూరు రైతు

సాగుకు యోగ్యం కానీ భూములు తీసుకోవాలని...

నాగర్​కర్నూల్ జిల్లా వెల్దండలో ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ పర్యావరణ జిల్లా కలెక్టర్ శర్మన్ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు లేవని.. వీలైనంత త్వరగా ప్రాజెక్టును పూర్తి చేయాలనే అభిప్రాయం వ్యక్తమైంది. పర్యావరణానికి మాత్రమే పరిమితం కాకుండా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల విషయంలో తమకున్న అనుమానాలు, అభిప్రాయాలను కొందమంది కలెక్టర్ ముందుంచారు. గతంలో చేపట్టిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, డిండి ఎత్తిపోతల పథకం సకాలంలో పూర్తి కాలేదని, పరిహారం సైతం సకాలంలో అందలేదని, నిర్వహణ కూడా సరిగా లేదని రైతులు ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో మాత్రం పరిహారం సకాలంలో అందించాలని డిమాండ్​ చేశారు. వీలైనంత త్వరగా ప్రాజెక్టును పూర్తి చేయాలని రైతులు విజ్ఞప్తి చేశారు. కాల్వల కోసం సాగుకు యోగ్యంగా లేని భూముల్ని సేకరిస్తే మేలనే అభిప్రాయం వ్యక్తమైంది. భూముల విలువ గణనీయంగా పెరిగిన నేపథ్యంలో కాల్వల నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు మంచి పరిహారం అందించాలని ఎక్కువమంది అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రాజెక్టును స్వాగతిస్తున్నామని.. పర్యావరణపరంగా ఇబ్బందులు లేవని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అభిప్రాయపడ్డారు.

రైతుల మధ్య అభిప్రాయ భేదాలు..

నారాయణపేటలో ఓ ప్రైవేటు ఫంక్షన్​హాల్​లో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణకు జిల్లా కలెక్టర్ హరిచందన సారథ్యం వహించారు. 9 మండలాల నుంచి రైతులు తమ అభిప్రాయాలను వెల్లడించినట్లు అధికారులు తెలిపారు. పాలమూరు -రంగారెడ్డి పథకం ద్వారా 200 కిలో మీటర్ల నుంచి సాగునీరు తీసుకురావడం కంటే 40 కిలో మీటర్ల నుంచి కృష్ణా జలాలను అందిస్తే రైతులకు మేలు జరుగుతుందని సాయి కుమార్​ అనే యువ రైతు సలహా ఇచ్చారు. ఆ సమయంలో ఇతర రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మాట్లాడేందుకు అవకాశం దక్కని వాళ్లు లిఖిత పూర్వకంగా తమ అభిప్రాయాలు అందించారు.

విపక్షాల నిరసన...

ప్రజాభిప్రాయ సేకరణలో తమకు అవకాశం ఇవ్వకుండా అధికారపార్టీకి మాత్రమే అవకాశం ఇచ్చారని సీపీఎం, భాజపా నాయకులు ఆరోపించారు. హైదరాబాద్ ప్రధాన రహదారిపై నిరసనకు దిగారు. పాలమూరు- రంగారెడ్డికి తాము వ్యతిరేకం కాదన్న విపక్షాలు.. జీవో- 69ను అమలు చేస్తూ నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా సాగు, తాగు నీరివ్వాలని డిమాండ్ చేశారు. మూడు జిల్లాల్లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణను అధికారులు వీడియో రికార్డింగ్ చేశారు. లిఖిత పూర్వకంగా ఇచ్చిన అభిప్రాయాలను సైతం స్వీకరించారు. ఈ సందర్భంగా అన్నిచోట్ల పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొబైల్ ఫోన్లు వినియోగిచేందుకు అనుమతించలేదు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details