లాక్డౌన్ సడలింపుల తర్వాత ప్రజలు కొవిడ్ నిబంధనలను ఏ మాత్రం పాటించడం లేదు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం మాస్క్ ధరించి బయటకు వెళ్లాలి. అయినా... చాలామంది మాస్కులు లేకుండానే తిరుగుతున్నారు. మాస్క్ ధరించకపోతే వినియోగదారునికి ఎలాంటి సేవలు అందించవద్దన్న నిబంధనలు కూడా బేఖాతరు చేస్తున్నారు. ఇక భౌతికదూరం, శానిటైజేషన్ వంటివి ఎక్కడా అమలు కావడం లేదు. బస్టాండ్లు, మార్కెట్లు, కూడళ్లు, సభలు, సమావేశాల దగ్గర కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉన్నా... ఎవరూ పట్టించుకోవడం లేదు.
జనంలో భయం తగ్గిపోయింది..
వైరస్ బారిన పడుతున్నవారిలో 85శాతం మందికి అసలు లక్షణాలు కనిపించడం లేదు. కేవలం 15శాతం మంది విషమ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కరోనా నుంచి ఎక్కువ మంది కోలుకుంటున్నారు. అందువల్ల ప్రస్తుతం వైరస్ పట్ల భయం జనంలో తగ్గిపోయింది. మరోవైపు రోగ నిరోధకశక్తి పెరిగితే మహమ్మారి బారి నుంచి తప్పించుకోవచ్చన్న సూచనలతో పండ్లు, తాజా కూరగాయలు, ఆకుకూరలు, ఎండు ఫలాలు, పాలు, గుడ్ల లాంటివి విస్తృతంగా లాక్‌డౌన్‌లో వినియోగించారు. ప్రస్తుతం ధరలు పెరిగిపోవడం వల్ల ఆహారం విషయంలోనూ తగిన జాగ్రత్తలు పాటించడం లేదు.