కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని ఎస్పీఎం పరిశ్రమలో ఈరోజు ఉదయం జరిగిన గ్యాస్ లీకేజీ ఘటనపై స్పందించింది పరిశ్రమ యాజమాన్యం. గ్యాస్ లీకేజీ ఘటన వెలుగులోకి వచ్చిన అనంతరం పరిశ్రమ ప్రతినిధులను సంప్రదించగా.. రెండు రకాలుగా స్పందించారు. ముందుగా ఉదయం గ్యాస్ లీకేజీ ఘటన జరిగిన మాట వాస్తవమే కానీ క్లోరిన్ గ్యాస్ కాదని, హెచ్‌సీఎల్ గ్యాస్ లీకేజీ అయిందని పరిశ్రమ వైస్ ప్రెసిడెంట్ మయాంక్ జిందాల్ అన్నారు.
ఎస్పీఎం గ్యాస్ లీకేజీ ఘటనపై పరిశ్రమ ప్రతినిధుల వివరణపై అనుమానాలు - spm gas leak
కాగజ్‌నగర్‌లోని ఎస్పీఎం పరిశ్రమలో జరిగిన గ్యాస్ లీకేజీ ఘటనపై పరిశ్రమ ప్రతినిధులు స్పందించారు. పరిశ్రమలో హెచ్‌సీఎల్ గ్యాస్ లీకేజీ అయిందని, ఎవరికి ఏ ప్రమాదం జరగలేదని పరిశ్రమ వైస్ ప్రెసిడెంట్ మయాంక్ జిందాల్ తెలిపారు. మరికాసేపటికే.. మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని, ఎటువంటి గ్యాస్ లీక్ కాలేదన్నారు. పరిశ్రమ ప్రతినిధులు రెండు రకాలుగా మాట్లాడటం పలు అనుమానాలకు తావిస్తోంది.
లీకేజీ అయిన హెచ్‌సీఎల్ గ్యాస్ పక్కనే ఉన్న మురుగు నీటితో కలిసి వాసన రావటం వల్ల కార్మికులు భయాందోళనలకు గురయ్యారని తెలిపారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని, అందరిని ఇంటికి పంపించామని.. క్షేమంగానే ఉన్నారని తెలిపారు. నాగుల రాజం అనే కార్మికుడు అనారోగ్యం కారణంగానే ఆసుపత్రిలో చేరాడని గ్యాస్ లీకేజీ వల్ల కాదని పేర్కొన్నారు.
మరికాసేపటికి.. మీడియాలో వస్తున్నట్లు పరిశ్రమలో గ్యాస్ లీకేజీ ఘటనేది జరగలేదని, ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని, అందరూ క్షేమంగానే ఉన్నారని తెలిపారు. గ్యాస్ లీకేజీ ఘటనపై పరిశ్రమ ప్రతినిధులు రెండు రకాలుగా మాట్లాడటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఒకసారి ఘటన జరిగిందని, మరికాసేపటికి జరగలేదని తెలపడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉదయం 6గంటల 30 నిమిషాలకు గ్యాస్ లీకేజీ ఘటన జరిగినప్పటికీ ఎందుకు గోప్యత పాటిస్తున్నారనేది తెలియరావడం లేదని కార్మికులు అంటున్నారు.
ఇవీ చూడండి: కాగితపు పరిశ్రమలో గ్యాస్ లీక్... రహస్యంగా ఉంచిన యాజమాన్యం