Government stepping into the Real Estate Business: ప్రభుత్వ, అసైన్డు, సీలింగు భూముల్లో స్థిరాస్తి వ్యాపారం చేసేందుకు జిల్లాలవారీగా చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు... ఖమ్మం జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతున్న ప్రాంతాలకు ఆనుకుని ఉన్న ప్రభుత్వ, అసైన్డు, సీలింగు భూములను గుర్తిస్తోంది. ఈ భూముల్లో హక్కుదారులుగా ఉన్న నిరుపేదలు, ఎస్సీ కుటుంబాలు కొంతకాలం వ్యవసాయం చేసుకున్నా.. ఆ తర్వాత వదిలేయడంతో భూములు బీడుగా ఉన్నాయి. ఇదే అదునుగా స్థిరాస్తి వ్యాపారులు.. ఖమ్మం నగరానికి సమీపంలోని ప్రభుత్వ, అసైన్డ్, సీలింగు భూములను కలిపేసుకున్నారు. ఈ భూములు లబ్ధిదారులకు ఉపయోగపడక, ప్రభుత్వ అధీనంలో లేక, న్యాయస్థానాల్లో కేసుల తీవ్రత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే స్వయంగా రంగంలోకి దిగి.. స్థిరాస్తి వ్యాపారానికి తెరతీస్తోంది. ఈ మేరకు తహసీల్దారు ఆరా తీశారని అసెన్డు భూముల పట్టాదారులు తెలిపారు.
"ఇటీవల తహసీల్దార్ మాతో సమావేశం అయ్యారు. 320 ఎకరాలు ఇంతకుముందే పట్టాలు ఇచ్చారు. ఇంకా కొంత భూమి ఉంది. అందరూ సమష్టిగా ఉంటే.. స్థిరాస్తి వ్యాపారంలోకి భూములు పెట్టొచ్చని చెప్పారు. అదీ మా ఇష్ట పూర్తిగానే అని చెప్పారు. భూములు ఇవ్వదలుచుకుంటే దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు."-అసైన్డ్ పట్టాదారు, ఖమ్మం జిల్లా
పైలట్ ప్రాజెక్టుగా ఆ మండలాలు
స్తంభాద్రి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలోని ఖమ్మం, ఖమ్మం గ్రామీణం, రఘునాథపాలెం, కొణిజర్ల, వైరా మండలాలను అధికారులు ఎంపిక చేశారు. సత్తుపల్లి మున్సిపాలిటీలోనూ ఈ తరహా భూసేకరణకు శ్రీకారం చుట్టారు. ఖమ్మం గ్రామీణం మండలంలో మొత్తం 250 ఎకరాలు, తీర్థాల రెవెన్యూ పరిధిలో 772 సర్వే నెంబర్‌లో 150 ఎకరాలు, మరో చోట 100 ఎకరాలు గుర్తించారు. రఘునాథపాలెం మండలం మంచుకొండ సర్వే నెంబర్ 338లో 120 ఎకరాలు, కొణిజర్ల మండలం తనికెళ్లలో 189 సర్వే నెంబర్‌లో 49 ఎకరాలు గుర్తించారు. వైరా మున్సిపాలిటీకి 5 కిలోమీటర్ల సమీపంలోని సోమవరంలోని పలు సర్వే నెంబర్లలో 280 ఎకరాలు సేకరించారు. సత్తుపల్లి మండలం బేతుపల్లి రెవెన్యూ పరిధిలో 40 సర్వే నెంబర్‌లో 95 ఎకరాలు ఎకరాలు సేకరించారు. ఈ ప్రాంతాల్లో లేఅవుట్ చేసేందుకు చకచకా చర్యలు చేపడుతున్నారు.