తెలంగాణ

telangana

ETV Bharat / state

రహదారులు గుంతలమయం... ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు రహదారులు అస్తవ్యస్తంగా మారాయి. ఎక్కడ చూసిన గుంతలమయం. తారు కొట్టుకుపోయి వస్తున్న ధూళి వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరమ్మతుల కోసం అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపినా... నిధుల విడుదల ఆలస్యమవుతుండటం వల్ల ప్రజలకు కష్టాలు తప్పట్లేదు.

రహదారులు గుంతలమయం... ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు
రహదారులు గుంతలమయం... ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు

By

Published : Nov 8, 2020, 6:24 AM IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రహదారులపై ప్రయాణమంటేనే వాహనదారులు భయపడుతున్నారు. ఏటా మరమ్మతులు చేపడుతున్నా... మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతోంది. ఇటీవల భారీ వర్షాలు, వరదల ధాటికి రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. నిత్యం వందలాది మంది రాకపోకలు సాగించే రహదారులు గుంతలమవ్వగా... ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. మరికొన్ని చోట్ల తారు చెదిరి, మట్టి తేలి బురదమయంగా మారాయి. ఇప్పుడు ధుమ్ము ధూళితో ప్రయాణాలు మరింత నరకప్రాయంగా మారాయి.

అధ్వానంగా రహదారులు...

ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో రహదారుల పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. ఖమ్మం-సూర్యాపేట, ఖమ్మం- హైదరబాద్‌ రహదారిలో చాలా చోట్ల గుంతలు ఏర్పడ్డాయి. రాత్రి వేళల్లో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. కొత్తగూడెం, భద్రాచలం, వైరా,మధిర ప్రాంతాల్లో అనేక చోట్ల రోడ్లు ధ్వంసమై... రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఇలాంటి రహదారిపై ప్రయాణాలు చేయటం వల్ల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గమ్యం చేరాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు.

ప్రభుత్వానికి నివేదన...

రహదారుల మరమ్మతుల కోసం అధికారులు... ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించారు. ఖమ్మం ఆర్​ అండ్ బీ పరిధిలో రూ. 3 కోట్ల 60 లక్షలతో ప్రతిపాదనలు పంపగా భద్రాద్రి కొత్తగూడెంలో మొత్తం 58 పనులకు గానూ రూ. 3 కోట్లు అవసరం పడుతోందని అంచనా వేశారు. బ్రిడ్జిలు, రోడ్ల నిర్మాణాల కోసం మరో రూ. 100 కోట్లు కావాలని ప్రభుత్వానికి నివేదిక అందించారు.

విడుదల కాని నిధులు...

ఇంతవరకు నిధులు విడుదల కాకపోవడం వల్ల నిరీక్షణ తప్పడం లేదు. ప్రభుత్వం త్వరితగతిన నిధులు కేటాయించి మరమ్మతులు పూర్తి చేస్తేనే ప్రజలకు ప్రయాణ ఉపశమనం కలుగుతుంది. లేకపోతే ఇబ్బందులు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు.

ఇదీ చూడండి:'సీఎం సారూ.. మేం చచ్చిపోతాం... కారుణ్య మరణాలకు అనుమతివ్వండి'

ABOUT THE AUTHOR

...view details