Gollapadu canal Khammam district: ఖమ్మం నగరాన్ని దశాబ్దాలుగా పట్టి పీడించిన గోళ్లపాడు ఛానెల్ గత చరిత్రను మార్చుకుని నేడు నగరానికే మరో మణిపూసగా మారింది. ఎటుచూసినా మురుగుతో ముక్కుపుటలు అదిరే దుర్వాసనతో నగర వాసులకు నిత్యనరకంగా మారిన గోళ్లపాడు కాలువ ఇప్పుడు నగరవాసులకే కాదు పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. మొత్తం 10.60 కిలోమీటర్ల పాటు గోళ్లపాడు ఛానెల్ ఆధునికీరణ పేరుతో చేసిన అభివృద్ధితో ఎటుచూసినా ఆహ్లాదం, అందమైన ఫౌంటేన్లు, పచ్చదనంతో ఫరిడవిల్లుతోంది.
గోళ్లపాడు ఛానెల్ ఆధునికీకరణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక నిధుల కింద 70 కోట్లు మంజూరు చేశారు. ఆ తర్వాత గోళ్లపాడు కాల్వపై సుందరీకరణ కోసం మరో 30 కోట్లు కేటాయించటంతో మొత్తం 100 కోట్లతో అద్భుతమైన పురోగతి సాధించిన గోళ్లపాడు ఛానెల్ నగరాన్ని మరింత మనోహరంగా కనిపించేలా చేస్తోంది.
గోళ్లపాడు కాలువపై మొత్తం 10.60 కిలోమీటర్ల పొడవున భూగర్భంలో ప్రత్యేకంగా మురుగు నీటి వ్యవస్థ, పైన మొత్తం సుందరీకరణ చేపట్టి అద్భుతంగా తీర్చిదిద్దారు.
కాల్వ పొడవునా ఎక్కడ చూసినా ఆహ్లాదం, ఆటవిడుపే దర్శనమిస్తుంది. చిన్నారులు ఆడుకునేందుకు వీలుగా పెద్దలకు ఆటవిడుపు కోసం క్రీడా ప్రాంగణాలు, పార్కులు ఏర్పాటు చేశారు. ఎటుచూసినా వాకింగ్ ట్రాక్ లు, ఓపెన్ జిమ్ లు, గోడలకు వాల్ ప్రాజెక్టులు, ఆక్యుపెంచర్ పార్కులు, పదుల సంఖ్యలో పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. దీంట్లో వివిధ రకాలైన 5 వేల మొక్కలు నాటారు. షటిల్, వాలీబాల్, బాస్కెట్ బాల్ కోర్టులు అందుబాటులోకి తెచ్చారు. అన్నిచోట్లా మొబైల్ టాయ్ లెట్స్ అందుబాటులో ఉంచారు.