తెలంగాణ

telangana

ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. ఆందోళనలో అన్నదాతలు

By

Published : Apr 18, 2019, 1:18 PM IST

Updated : Apr 18, 2019, 3:39 PM IST

ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్మేందుకు వచ్చిన రైతన్నకు కొనుగోలు కేంద్రాల్లో అధికారుల నిర్లక్ష్యం ఆవేదన కలిగిస్తోంది. ఖమ్మం జిల్లాలో మార్కెట్​ కేంద్రాల్లో గన్నీ సంచులు, రవాణా సౌకర్యం లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ మార్పులతో ధాన్యం ఏమవుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఖమ్మం రైతులు

ఉమ్మడి ఖమ్మం జిల్లా మార్కెట్​ యార్డులో ధాన్యం రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ధాన్యం కొనుగోళ్ల కోసం రోజుల తరబడి ఎదురు చూస్తూ అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో... ధాన్యాన్ని తీసుకెళ్లే అవకాశం లేక దిక్కు తోచని స్థితిలో ఉన్నారు.

సంచుల కొరత

ఖమ్మం మార్కెట్ యార్డులో ధాన్యం తరలించేందుకు కొనుగోలు కేంద్రాల్లో గన్నీ సంచులు అవసరమైనన్ని లేవు. జిల్లా వ్యాప్తంగా 34 లక్షల సంచులు అవసరం కాగా.. 8 లక్షలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వాహనాల కొరత కూడా రైతులకు ఇబ్బందిగా మారింది. అధికారులు కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు వాపోతున్నారు. కాటా వేసిన ధాన్యాన్ని తరలించే వీలు లేక.. వాతావరణ మార్పులతో ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

త్వరలోనే పూర్తిగా కొనుగోలు చేస్తాం

గన్నీ సంచుల కొరత, వాహనాల లేమి వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయన్నది మార్కెట్​ యార్డు సిబ్బంది వాదన. మిల్లర్ల వద్ద కూడా జాప్యం జరుగుతుందన్నారు. త్వరలోనే మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని తెలిపారు.
95 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకూ 10,760 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఇంకా లక్షా 49 వేల మెట్రిక్​ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉంది.

ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై రైతుల ఆందోళన

ఇదీ చదవండి : నూతన చట్టం.. అవినీతి రహిత పాలనే లక్ష్యం

Last Updated : Apr 18, 2019, 3:39 PM IST

ABOUT THE AUTHOR

...view details