కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియం ఉదయం 5గంటల నుంచే చిన్నారులతో కిటకిటలాడుతోంది. విద్యా సంవత్సరమంతా పుస్తకాలతో కుస్తీపడిన చిన్నారులకు సెలవులు అంటే సరదానే.. వేసవి సెలవుల్లో సమయాన్ని వృధా చేయకుండా క్రీడల్లో శిక్షణ పొందేందుకు తరలి వస్తున్నారు. పిల్లలు తమ అభిరుచులకు అనుగుణంగా క్రీడల్లో శిక్షణ పొందుతున్నారు. కొందరు చెస్ క్రీడ పట్ల ఆసక్తి కనబరిస్తే మరికొందరు క్రికెట్, కరాటే, టెన్నిస్, ఫుట్‌బాల్, బ్యాట్మెంటన్లో మెలుకువలు నేర్చుకుంటున్నారు. నెల రోజుల పాటు సాగే శిక్షణకు ఈ ఏడాది దాదాపు 5 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. అందులో పిల్లల సామర్థ్యం మేరకు 3,500 మందిని ఎంపిక చేసి తర్పీదు ఇస్తున్నారు.
వేసవి సెలవుల్లో సరదా ఆటలు
చిన్నారులకు వేసవి శిక్షణలో... కరీంనగర్ పాలక సంస్థ ప్రత్యేకతను చాటుకొంటోంది. సామాజిక బాధ్యతగా మూడేళ్ల క్రితం ప్రారంభించగా అపూర్వ స్పందన లభించడం వల్ల ఈ కార్యక్రమాన్ని ఏటా నిర్వహిస్తోంది. ఏటికేడు వేసవి శిబిరాల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. చిన్నారులకు శిక్షణ ఇవ్వడమే కాకుండా పౌష్టికాహారం కూడా అందజేస్తుండడం వల్ల ఈ శిక్షణ పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు.
ఆత్మరక్షణ కోసం
బాలికలు ఆత్మరక్షణ కోసం కరాటే, కిక్ బాక్సింగ్ నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. చిన్నారులకు క్రీడల్లో శిక్షణతో పాటు పాలు, గుడ్డు, అరటిపండు ఇస్తున్నారు.
జిల్లా క్రీడాప్రాకార సంస్థ, నగరపాలక సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న వేసవి శిబిరాన్ని అసిస్టెంట్ కలెక్టర్ ప్రావీణ్య సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. శిక్షణపై చిన్నారుల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు.ఈ ఏడాది 23 క్రీడల్లో శిక్షణ ఇస్తున్న అధికారులు వచ్చే సంవత్సరం మరిన్ని ఆటల్లో శిక్షణ ఇస్తామన్నారు. ఇవీ చూడండి: ప్రభుత్వ ఏర్పాటుకు మోదీకి రాష్ట్రపతి ఆహ్వానం