దసరా పండగ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కానుంది. కరీంనగర్ జిల్లాలో వానాకాలంలో లక్షా 18వేల హెక్టార్లలో పంట సాగు చేస్తే 5 లక్షల 60వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. స్థానిక అవసరాలకు 71వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పోను.. మార్కెట్‌కు 4 లక్షల 88వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇందులో సన్న రకాలు లక్షా 70వేల మెట్రిక్ టన్నులు ఉండే అవకాశం ఉంది. కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొని.. వెంటనే మిల్లులకు తరలించాలని అధికారులు భావిస్తున్నారు. కాకపోతే.. పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నంగా ఉందని రైస్ మిల్ల్లుల యజమానులు వాపోతున్నారు.
పేరుకుపోయిన యాసంగి నిల్వలు.. సామర్థ్యం లేని రైస్‌మిల్లులు 24 గంటలంటే.. కష్టమే
ఇప్పటికే యాసంగి ధాన్యంతో రైస్‌మిల్లులు నిండిపోయాయని వాటిని బియ్యంగా మార్చి ఇవ్వడానికే మరో రెండు నెలల సమయం పడుతుందని మిల్లర్లు అంటున్నారు. అధికారులు పదేపదే రైస్‌మిల్లులు తనిఖీ చేస్తూ కస్టమ్ మిల్లింగ్ వెంటనే ప్రభుత్వానికి అందించాలని ఒత్తిడి చేస్తున్నా ఆచరణలో సాధ్యం కావడం లేదు. కరోనాతో పాటు కూలీల కొరత వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైస్ మిల్లులను ఏకధాటిగా 24 గంటలపాటు నడిపిస్తూ ధాన్యాన్ని మరాడించాలని జిల్లా అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. పాతకాలం నాటి రైస్ మిల్లులు కావడం వల్ల ఏకబిగిన 24 గంటలు నడపడం సాధ్యం కావడం లేదని, యంత్రాలు మాటిమాటికి మొరాయిస్తున్నాయని మిల్లుల యజమానులు వాపోతున్నారు. సకాలంలో ధాన్యం మరాడించలేకపోతున్నామని వివరిస్తున్నారు.ఈ లెక్కన మిల్లుల్లో ధాన్యం అంత త్వరగా ఖాళీ అయ్యే అవకాశం లేదని మిల్లర్లు అంటున్నారు.
సామర్థ్యమే లేదు
జిల్లాలో రా ధాన్యం పట్టే రైస్ మిల్లులు 83 ఉండగా లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే నిల్వచేసుకునే అవకాశం ఉంది. 88 పారాబాయిల్డ్ రైస్ మిల్లుల్లో సుమారు 190వేల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం కలిగి ఉన్నాయి. ప్రస్తుతం రా ధాన్యం పట్టే రైస్ మిల్లులు ఖాళీగా ఉన్నా.. పారాబాయిల్డ్ రైస్‌మిల్లులు యాసంగి ధాన్యంతో నిండుగా ఉన్నాయి. యాసంగి 2019-20లో 4లక్షల 60వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలిస్తే ఈ నెల ఒకటో తేదీ నాటికి 1లక్ష 32వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మరాడించి ఇచ్చారు. ఇంకా ఒక లక్ష 80వేల మెట్రిక్ టన్నుల బియ్యం బకాయి ఉంది.
బకాయిలు చెల్లించకపోతే ఎలా?
ఈ మేరకు ప్రస్తుతం 42.44శాతం ధాన్యం మిల్లులో నిల్వ ఉంది. జిల్లాలో కొనుగోలు ప్రక్రియ ప్రారంభమయ్యే నాటికి మిల్లులో ఖాళీ ఏర్పడే అవకాశాలు తక్కువేనని రైస్ మిల్లుల ప్రతినిధులు పేర్కొంటున్నారు. దీనికి తోడు ప్రభుత్వం తమకు రావల్సిన మిల్లింగ్ బకాయిలు ఇవ్వకపోవడం ఇబ్బందిగా ఉందని మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలీలకు, విద్యుత్ బిల్లులు కట్టక తప్పడం లేదని.. ప్రభుత్వం మాత్రం బకాయిలు చెల్లించకుండా.. మిల్లింగ్ చేయమనడం సరికాదంటున్నారు. పరిస్థితులకు అనుగుణంగా మిల్లింగ్ ఛార్జీలు పెంచకపోవడం వల్ల తాము నష్టాల్లో కూరుకు పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తమకు రావల్సిన బకాయిలు చెల్లించడమే కాకుండా ధాన్యం మరాడించడానికి మరింత గడువు ఇస్తే తప్ప వానాకాలం ధాన్యం కొనుగోలులో అవాంతరాలు తొలగించలేమని రైస్‌మిల్లర్లు సూచిస్తున్నారు.
ఇవీచూడండి:భాగ్యనగరంలో బీభత్సం.. ప్రతి ఒక్కరు సాయం చేయండి: గవర్నర్