నేరాలను అరికట్టేందుకు కరీనంగర్ పోలీసులు మరో పకడ్బందీ ప్రణాళికను అమలు చేస్తున్నారు. కరీంనగర్‌లో ప్రతి ఆటోకు క్యూఆర్ కోడ్ కేటాయించి ప్రయాణానికి మరింత భద్రత కల్పించే దిశగా సాగుతున్నారు. ప్రతి రోజు నగరానికి వచ్చే వేలాది మంది ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఈ విధానానికి శ్రీకారం చుట్టారు. ఒకవైపు సీసీ కెమెరాలు.. మరోవైపు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రయాణికులకు భద్రత కల్పిస్తున్నారు.
విధిగా కోడ్ స్కాన్ చేసుకోవాలి
కరీంనగర్‌లో సుమారు 8వేల వరకు ఆటోలు ఉన్నాయి. వివిధ జిల్లాలు, పట్టణాల నుంచి ప్రతిరోజు దాదాపు లక్ష మంది వస్తుంటారని అంచనా. విద్య, వాణిజ్య, వైద్య ఇతరత్రా అవసరాల కోసం వచ్చే వారికి ఏకైక రవాణా సదుపాయంగా ఆటో అందుబాటులో ఉంటుంది. అయితే ఈ ఆటో ప్రయాణాన్ని సురక్షితంగా తీర్చిదిద్దటానికి సీపీ కమలాసన్‌రెడ్డి బృహత్తర ప్రణాళిక రూపొందించారు. ప్రతి ఆటో ఎక్కడికి వెళుతుంది. అందులో ప్రయాణించే వారి పట్ల ఆటోడ్రైవర్లు ప్రవర్తించే తీరును కాపలా కాయడం కష్టంగా మారింది. దీనితో ప్రతి ఆటోకు సంబంధించిన వివరాలన్నీ ట్రాఫిక్ పోలీసులు సేకరించారు. వారికి సంబంధించి పుట్టు పూర్వోత్తరాలు తమ వద్ద పెట్టుకోవడమే కాకుండా.. ప్రతి ఆటోకు ఒక క్యూఆర్ కోడ్‌ను కేటాయించారు. ఆటోలో ప్రయాణించే వారు విధిగా ఈ క్యూఆర్ కోడ్‌ను తమ ఫోన్లలో స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది. కోడ్ స్కాన్ చేయగానే ఆటోడ్రైవర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ప్రయాణికునికి చేరుతాయి. ఒక వేళ డ్రైవర్ ప్రవర్తన సరిగా లేకపోతే నేరుగా పోలీసులకు ఫిర్యాదు అందించే సదుపాయాన్ని క్యూఆర్ కోడ్‌లో కల్పించినట్లు ట్రాఫిక్ సీఐ తిరుమల్ తెలిపారు.
ప్రతి ఆటోకు క్యూఆర్ కోడ్ విధానాన్ని యజమానులు ఆహ్వానిస్తున్నారు. వేల ఆటోలు ఉన్న కరీంనగర్ నగరంలో ఎవరో ఒకరు అనుచితంగా ప్రవర్తిస్తే వారి వివరాలు తెలియకపోగా.. అందరూ అప్రతిష్ఠపాలయ్యే వారమని చెబుతున్నారు. ఇప్పుడు ఈ విధానం వల్ల ప్రయాణికులు నిర్భయంగా ఆటోల్లో ప్రయాణించేందుకు వీలు కలుగుతుందని చెబుతున్నారు. ఒక వేళ ప్రయాణీకులు తమ విలువైన సామాన్లు పోగొట్టుకున్నా.. మరిచిపోయినా వాటిని త్వరగా పొందేందుకు వీలుంటుందని సంతృప్తిని వ్యక్తం చేశారు. తాము కూడా విధిగా క్యూఆర్ కోడ్ ఉన్న ఆటోల్లోనే ప్రయాణించాలని అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.