దళితుల సంపూర్ణ సాధికారతే లక్ష్యంగా రాష్ట్రంలో దళితబంధు పథకాన్ని అమలుచేసేందుకు సర్కారు సిద్ధమైంది. ఈనెల 16న హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనుండగా ఇప్పటికే నియోజకవర్గానికి చెందిన దళిత ప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. పథకం లక్ష్యాలు వివరించిన సీఎం వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వ్యక్తిగత సమస్యలు సహా దళితవాడల్లో సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. రోడ్లు, విద్యుత్‌స్తంభాలు, డ్రైనేజీ సౌకర్యం లేవని నేతలతోపాటు పలువురు ముఖ్యమంత్రి దృష్టికితీసుకెళ్లారు.
దళితబస్తీల్లో మౌలిక సదుపాయాలు
స్పందించిన ముఖ్యమంత్రి దళితబంధు అమలుతోపాటు దళితవాడల్లో మౌలికసదుపాయాలను మెరుగుపర్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఆ మేరకు అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఇదే సమయంలో దళితుల అసైన్డ్, గ్రామకంఠం వంటి భూసమస్యలు పరిష్కరించాలని.. దళితవాడల్లో తాగునీరు, రహదారులు సహా మౌలిక వసతులను సంపూర్ణస్థాయిలో మెరుగుపర్చి, దళితబంధు పథకం అమలుచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని దళితుల స్వాధీనంలోని గ్రామకంఠాల భూముల వివరాల జాబితా సిద్ధంచేయడంతోపాటు. దళితులకే హక్కులు కల్పించేలా చర్యలు చేపట్టాలని.. ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. హుజూరాబాద్‌లో వారం, పది రోజుల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టి అసైన్డ్ భూములు సహాదళితులకు చెందిన అన్ని సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు. దళితవాడల స్థితిగతి తెలిపేలా ప్రొఫైల్ తయారుచేయాలన్న ఆదేశాలతో వివిధశాఖలకు చెందిన ఇంజనీర్ల నేతృత్వంలోని 108 బృందాలు.. క్షేత్రస్థాయిలో పర్యటించి మౌలిక సదుపాయాలు, వసతుల వివరాలు సేకరించాయి. ఆ వివరాల ఆధారంగాప్రొఫైల్ తయారు చేస్తున్నారు.