తెలంగాణ

telangana

ETV Bharat / state

అమ్మా.. నన్ను ఎందుకు అమ్మేశావ్.. నేనేం తప్పు చేశాను..?

Parents sale baby girl: అమ్మ ప్రేమను అందుకోలేని దీనస్థితి ఆ చిన్నారిది. తండ్రి లాలనకూ నోచుకోని దుస్థితి ఆ శిశువుది. తల్లిదండ్రుల సంరక్షణలో హాయిగా ఎదగాల్సిన ఆ పసిపాపను కన్నవాళ్లే అంగట్లో బొమ్మలా ఇతరులకు అమ్మేశారు. అప్పటికే ముగ్గురు సంతానం కలిగిన ఆ తల్లిదండ్రులు మరో ఆడ శిశువు పుట్టడంతో భారంగా భావించారు. పొత్తిల్లలోనే ఆ పసికందును అమ్మకానికి పెట్టిన అమానవీయ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. మరోవైపు సంగారెడ్డి జిల్లాలోనే అప్పుడే పుట్టిన శిశువును ముళ్లపొదల్లో వదిలేసి వెళ్లారు.

By

Published : Apr 15, 2023, 1:15 PM IST

Baby sale
Baby sale

Parents sale baby girl: పిల్లల కోసం పరితపించిపోయే తల్లిదండ్రులను చూశాం. సంతానం కోసం కొందరు.. దేవుళ్లకు మొక్కులు, నోములు చేయడం చూశాం. కానీ కామారెడ్డి జిల్లాలో మాత్రం.. కంటికి రెప్పలా కాపాడాల్సిన ఆ తల్లిదండ్రులు పోషించే స్థోమత లేక ఆడ శిశువు అమ్మకానికి పెట్టారు. అప్పుడే పుట్టిన ఆ ఆడబిడ్డను తల్లి పొత్తిళ్ల నుంచి వేరు చేశారు. ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఐసీడీఎస్​, పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. జిల్లాలోని స్కూల్ తండాకు చెందిన భూక్య మమతకి ముగ్గురు సంతానం. ఆమె మరోసారి గర్భం దాల్చడంతో నాలుగో కాన్పులో పండంటి ఆడ బిడ్డకు స్థానిక రామారెడ్డి పీహెచ్​సీలో జన్మనిచ్చింది. ఆ తరువాత వెంటనే ఆ శిశువును తల్లిదండ్రులు వేరే వ్యక్తులకు అమ్మేశారు. అనంతరం మమత రెండు రోజులు చికిత్స తరువాత తండాలోని ఇంటికి వచ్చేశారు.

విషయం తెలుసుకున్న స్థానిక ఆశా కార్యకర్త బాలింత ఇంటికి వెళ్లి ఆడ శిశువు గురించి ఆరా తీశారు. వారు తమ బంధువుల ఇంటి వద్దకు తీసుకెళ్లామని.. తిరిగి తీసుకొస్తామని నమ్మబలికారు. అనుమానమొచ్చిన ఆశా వర్కర్ గట్టిగా నిలదీయగా.. ఆమెపై దుర్భషలాడారు. ఆమెఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో ఐసీడీఎస్​ అధికారులు, పోలీసులు గ్రామానికి చేరుకొని దర్యాప్తు చేశారు. శిశువు అమ్మకం గురించి తెలుసుకున్న.. ఐసీడీఎస్ అధికారులు స్థానిక రామారెడ్డి పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న రామారెడ్డి ఎస్​ఐ అనిల్​ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. శిశువును ఎవరు కొనుగోలు చేశారన్నది ఇంకా తెలియాల్సి ఉంది.

ముళ్ల పొదల్లో శిశువు గుర్తింపు: మరో ఘటనలో అప్పుడే పుట్టిన శిశువును ముళ్ల పొదల్లో వదిలి వెళ్లారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. పటాన్​చెరు మండలం క్యాసారం గ్రామ పరిధి ఎస్సీ కాలనీలో ఉదయం అప్పుడే పుట్టిన ఆడ శిశువును పొదల్లో స్థానికులు గుర్తించారు. వెంటనే వారు ఐసీడీఎస్​ అధికారులు, బీడీఎల్​ భానూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అధికారులు వచ్చి వెంటనే శిశువును సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ శిశువుకు మెరుగైన వైద్యం అందించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే ఆ శిశువును కుక్క కరిచినట్లుగా అనుమానం వ్యక్తం కాగా.. వైద్యులు శిశువును ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి పరిశీలిస్తున్నారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

మూడు నెలల చిన్నారికి ఉరేసి.. ఆ తర్వాత భార్యాభర్తలు ఆత్మహత్య

వీధి కుక్కల దాడిలో.. బాలికకు తీవ్రగాయాలు

బతికున్న చేపను మింగిన మహిళ.. చివరికి ఏమయిందంటే.!

ABOUT THE AUTHOR

...view details