తెలంగాణ

telangana

ETV Bharat / state

Problems in Mahabubnagar Govt Schools : ఆ ప్రభుత్వ బడుల్లో వేలల్లో విద్యార్ధులు.. అంతంత మాత్రంగా వసతులు

Mahabubnagar Govt Schools Problems : సాధారణంగా బాగా డిమాండ్‌ ఉన్న కార్పొరేట్‌, ప్రైవేటు విద్యాసంస్థల ముందు నో-అడ్మిషన్‌ బోర్డులు దర్శనమమిస్తుంటాయి. అయితే విచిత్రంగా నాలుగు ప్రభుత్వ పాఠశాలల ముందు సైతం ఇదే పరిస్థితి కనిపిస్తుంది. వెయ్యికి పైగా విద్యార్థులు ఆయా స్కూళ్లలో చదువుతున్నప్పటికీ రోజూ వందలాది మంది ప్రవేశాల కోసం పాఠశాలల చుట్టూ తిరిగి వెళ్తున్నారు. ఇంతకీ ఆ పాఠశాలలకు ఎందుకంత డిమాండ్‌. విద్యారంగంలో వెనుకంజలో ఉన్న జోగులాంబ గద్వాల జిల్లాలోని సర్కారు బళ్లకు విద్యార్థులు ఎందుకు వరుస కడుతున్నారు ? ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం మీకోసం.

Etv Bharat
Etv Bharat

By

Published : Jul 7, 2023, 11:20 AM IST

ఇక్కడ విద్యార్ధులు వేలల్లో కానీ వసతులే అంతంత మాత్రం

Lack Of Facilities In Mahabubnagar Govt Schools : వెయ్యికి పైగా విద్యార్థులు చదువుతున్న పాఠశాలలు రాష్ట్రవ్యాప్తంగా 16 ఉంటే అందులో నాలుగు జోగులాంబ జిల్లాలోనే ఉన్నాయి. గద్వాల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో1522 మంది, అభ్యసన ఉన్నత పాఠశాలలో 1,113 మంది, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 1120 మంది, ధరూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1113 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ నాలుగు స్కూళ్లలోనూ ఇప్పుడు ప్రవేశాలు లేవంటూ ప్రధానోపాధ్యాయులు బోర్డులు పెట్టేశారు. కారణం విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అక్కడ తరగతి గదులు, ఉపాధ్యాయులు సహా ఇతర వసతులేమీ లేవు. ఉన్న వసతుల్నే వెయ్యి మందికి పైగా విద్యార్థులకు సర్దుబాటు చేస్తున్నారు. ఇంకా విద్యార్థులను చేర్చుకుంటే చదువులు సక్రమంగా సాగడం కష్టమని భావించి కొత్తగా ప్రవేశాలు తీసుకోవడం లేదు.

"మా పాఠశాలలో ప్రతి తరగతిలో 120మంది విద్యార్థులు ఉన్నారు. బెంచీలు సరిపోకా, గదులు చిన్నాగా ఉండటం వల్ల విద్యార్థులు కింద కూర్చోని పాఠాలు వింటున్నారు. అలా కింద కూర్చోని వినడం వల్ల విద్యార్థులకు సరిగ్గా వినపడకా, కనిపించక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఉన్న విద్యార్థుల సంఖ్యకు 25గదులు కావాలి కానీ ఉన్నవి 17గదులు మాత్రమే." -విష్ణు, హెచ్​ఎం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల.

విద్యార్థులు ఆసక్తి కనబర్చడానికి కారణాలేంటో తెలుసా :జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇతర పాఠశాలలకు మించి ఈ నాలుగింటిలో ప్రవేశాలు అధికంగా ఉండటానికి కారణాలు లేకపోలేదు. గద్వాల జిల్లా కేంద్రం సహా ధరూరు మండల కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన సంక్షేమ వసతి గృహాలున్నాయి. వీటిలో సుమారు 2వేల మంది నిరుపేద విద్యార్థులు, సమీప గ్రామాల్లోని విద్యార్థులూ గద్వాల ఉన్నత పాఠశాలలోనే చేరతారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే ఉపాధ్యాయుల కొరత తక్కువుండటం, మంచి ఫలితాలు వస్తుండటంతో ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు ఉచితంగా అందించడం సైతం వారిని ప్రభావితం చేస్తోంది.

ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ గురుకులాల్ని ప్రారంభించింది. కస్తూరిబా, సహా ఆదర్శ పాఠశాలలు వసతితో పాటు విద్యనందిస్తున్నాయి. వీటిల్లో ప్రవేశాలు దొరకని విద్యార్థులు ఆఖరి ప్రయత్నంగా మంచి ఫలితాలున్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చేరుతున్నారు.

"మా స్కూల్​లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల కింద కూర్చోని క్లాసెస్​ వింటున్నాం. కానీ పాఠాలు సరిగ్గా అర్థం కావడం లేదు. తరగతి ముందు ఎవరు వస్తే వారే బెంచీలపై కూర్చుంటున్నారు." -విద్యార్థి

తమ పిల్లలను ప్రైవేటు చదివించే స్తోమత లేదంటూ ఆవేదన :జిల్లాలో నిరుపేద కుటుంబాలు అధికంగా ఉండటం, పిల్లల్ని ఎలాగైనా చదివించాలనే తపన పెరగటం, తగిన ఆర్థిక వనరులు లేకపోవటం కారణంగా ఆ నాలుగు పాఠశాలలకు డిమాండ్‌ ఏర్పడిందని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం స్పందించి డిమాండ్‌ ఉన్న పాఠశాలల్లో వసతుల్ని ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. తమ పిల్లలను ప్రైవేటు చదివించే స్తోమత లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details