తెలంగాణ

telangana

ETV Bharat / state

భారీగా అంతర్జాల కనెక్షన్లు.. ఆన్‌లైన్‌ తరగతులతో మరింత పెరుగుదల

మనిషి జీవితంలో కరోనా భారీ మార్పులే తెచ్చింది. ఆరోగ్యంతోపాటు భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడంలోనూ కొత్త సూత్రాలు పాటించేలా చేసింది. విద్యార్థులను తరగతి గదులకు దూరం చేసింది. అంతర్జాలంలో పాఠాలు నేర్చుకొనేలా అలవాట్లనే మార్చేసింది. దీంతో విద్యార్థులతోపాటు తల్లిదండ్రులూ ఆన్‌లైన్‌ పాఠాల వైపు మొగ్గుచూపుతున్నారు.

internet usage increasing due to corona virus
భారీగా అంతర్జాల కనెక్షన్లు.. ఆన్‌లైన్‌ తరగతులతో మరింత పెరుగుదల

By

Published : Sep 18, 2020, 5:02 PM IST

ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో అంతర్జాల కనెక్షన్లను తీసుకొంటున్న వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. అంతర్జాలం స్థాయి అవసరం నుంచి అత్యవసరం స్థాయికి చేరింది. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ఓ నెట్‌వర్క్‌ బ్రాడ్‌బాండ్‌ కేబుల్‌ నెట్‌వర్క్‌ ఈ ఏడాది జూన్‌ కంటే ముందు 550 కనెక్షన్లను మాత్రమే కలిగి ఉంది. ప్రస్తుతం ఆ సంఖ్య 967కు చేరింది. ఇంతకుముందు నెలకు రూ.2 లక్షల వరకు సాగే వ్యాపారం ఇప్పుడు రూ.4.50 లక్షలకు పెరిగింది. అంటే జూన్‌ నుంచి ఆగస్టు చివరి వరకు వృద్ధిరేటు సగాని కంటే ఎక్కువైంది. కొత్త కనెక్షన్లు 417 దాకా పెరిగాయి. కరోనా కాలంలో పరిశ్రమలు పని చేయకపోవడంతో వాటికి కావాల్సిన కొన్ని రకాల వస్తువుల సరఫరా ఆగిపోయింది. దీంతో వారి వద్దనున్న వస్తువులతోనే ఈ కనెక్షన్లు ఇచ్చారు. సంబంధిత వస్తువులు వారి వద్ద ఉంటే మాత్రం కనెక్షన్లు 2వేల వరకు ఇచ్చేవారమని చెబుతున్నారు.

జోరుగా సిమ్‌ల విక్రయాలు

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సిమ్‌ కార్డుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కరోనా కాలంలో ఎక్కువ మంది చరవాణుల ద్వారా కాలక్షేపం చేశారు. దానికి తగ్గట్లుగానే డాటా వినియోగమూ పెరిగింది. విద్యా సంవత్సరం ప్రారంభమైన నాటి నుంచి అంతర్జాల వినియోగమూ మరింత పెరిగింది. ఆన్‌లైన్‌లో తరగతులు ప్రారంభం కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలకు కావాల్సిన అన్ని రకాల సదుపాయాలను సమకూరుస్తున్నారు. ల్యాప్‌టాప్, కంప్యూటర్లు, ట్యాబ్‌లు, సెల్‌ఫోన్లు తదితర వాటితోపాటు పలు రకాల నెట్‌వర్క్‌ల సిమ్‌ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఆయా కంపెనీల వారు నెలకు 500- 600 వరకు సిమ్‌కార్డులను విక్రయించేవారు. ప్రస్తుతం 1,000 నుంచి 1,200 వరకు అమ్ముడవుతున్నాయి.

నెట్‌వర్క్‌ డిమాండ్‌ రెండింతలు పెరిగింది..

ప్రస్తుతం నెట్‌వర్క్‌ వినియోగం బాగా పెరిగింది. ప్రతి ఇంట్లో ఉండేలా ఆసక్తి చూపుతున్నారు. దాని కోసం అనేక రకాల కంపెనీలకు చెందిన నెట్‌వర్క్‌ను కొంటున్నారు. అవసరాన్నిబట్టి ప్లాన్లను మార్చుకుంటున్నారు. రెండింతల కంటే ఎక్కువగా నెట్‌ వినియోగం పెరిగింది. నిత్యం అనేక మంది వినియోగదారులు నెట్‌ కనెక్షన్‌ కోసం ఫోన్లు చేస్తున్నారు. - రాఘవేంద్ర, నెట్‌వర్క్‌ సర్వీసెస్, మహబూబ్‌నగర్‌

ఇవీ చూడండి:వర్షం వస్తే... ఈ ఊరు జలదిగ్బంధం అవుతుంది

ABOUT THE AUTHOR

...view details