Central team visit: నెలరోజుల ముందే గోదావరికి భారీవర్షాలు రావడంతో ఉత్తర తెలంగాణచివురుటాకుల్లా వణికింది. పలు జిల్లాలు వరదగుప్పిట్లోనే చిక్కుకున్నాయి. పలు జిల్లాల్లో ప్రాజెక్టులు ఉప్పొంగి ప్రవహించగా పంట పొలాలను వరదనీరు ముంచెత్తింది. కొన్నిచోట్ల పొలాల్లో భారీగా ఇసుకమేటలు వేయగా బండరాళ్లు వచ్చిపడటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ప్రభుత్వమే సహకరించాలంటూ అన్నదాతలు విజ్ఞప్తి చేశారు. వివరాలు సేకరించిన అధికారులు దాదాపు 10 లక్షల హెక్టార్లలో పంటనష్టం జరగ్గా కోట్ల రూపాయల్లో రైతులు నష్టపోయినట్లు ప్రాథమికంగా నిర్ధరించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈ తరుణంలో ప్రకృతి విపత్తు కింద సాయం చేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా కలిగిన నష్టాలను అధ్యయనం చేసేందుకు కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి సౌరవ్‌రాయ్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరింస్తోంది. హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర బృందాన్ని రాష్ట్ర విపత్తు నిర్వహణాశాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జా కలిసి పరిస్థితిని వివరించారు. నష్టాలకు సంబంధించిన ప్రాథమిక అంచనాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కేంద్ర బృందం సభ్యులు జిల్లాల పర్యటనకు వెళ్లారు.
నిజామాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో ఏర్పడిన నష్టాన్ని అంచనా వేసేందుకు జక్రాన్ పల్లి మండలంలోని పడకల్, మనోహరాబాద్ గ్రామాల్లో కేంద్ర బృందం పర్యటించింది. తీవ్రంగా దెబ్బతిన్న రోడ్లు, నష్టపోయిన పంటలు, జిల్లాలో తెగిన కుంటలు, చెరువుల వివరాలను కలెక్టర్ నారాయణ రెడ్డి వారికి వివరించారు. పడకల్ గ్రామ పెద్ద చెరువు తెగిన కట్టను పరిశీలించారు. అధిక వర్షాల కారణంగా దెబ్బతిన్న, నష్టపోయిన వివరాలపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను కేంద్ర బృందం తిలకించింది.