తెలంగాణ

telangana

ETV Bharat / state

'క్లిక్' కొడితే .... అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు

చిన్నప్పటినుంచీ ప్రకృతి ప్రేమికుడే ఆ యువకుడు. ఆ ప్రకృతిలోని అందాలను సహజత్వం ఉట్టిపడేలా కెమెరాలో బంధించడంలో అందె వేసిన చేయి. ప్రాకృతిక సౌందర్యాన్ని అద్భుతమైన ఫొటోలతో కళ్లకు కడుతూ, ఆకట్టుకుంటున్నాడు భూపాలపల్లి యువకుడు అరుణ్ కుమార్. ఓవైపు దంతవైద్యుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. ఇష్టమైన రంగాల్లోనూ ప్రతిభ కనబరుస్తూ, ఫొటోలతో కనికట్టు చేస్తున్నాడు. చక్కటి సాహిత్యంతో పాటలూ రాస్తూ, ఆల్‌రౌండర్‌గా దూసుకుపోతున్నాడు.

nature photography
ఉత్తమ నేచర్ ఫొటోగ్రాఫర్‌గా గుర్తింపు,

By

Published : Jun 19, 2021, 3:27 PM IST

Updated : Jun 20, 2021, 2:05 PM IST

పనిలోనే ఫలితం...

'క్లిక్' కొడితే .... అంతర్జాతీయ స్ఠాయిలో అవార్ఢులు

ఫలితం ఆశించకుండా మనసుకు నచ్చిన పనిని చేసుకుంటూ పోతే, గుర్తింపు తనంతట తానే దరికి చేరుతుంది. అదే మాట మరోసారి నిరూపిస్తున్నాడు భూపాలపల్లికి చెందిన అరుణ్ కుమార్. చదువుతోపాటు, అభిరుచికి కాస్త సమయం కేటాయిస్తే, అదనపు నైపుణ్యాలు సొంతం చేసుకోవడంతో పాటు.. నలుగురిలో ప్రత్యేకంగా నిలబడొచ్చని చెప్పకనే చెప్తున్నాడు.


బాల్యం నుంచే...

అరుణ్‌కు చిన్నప్పటినుంచీ ఫొటోగ్రఫీ అంటే ఇష్టం. కాసేపు సమయం దొరికినా, ఫోన్ పట్టుకుని సమీపంలోని పార్కుకో, అడవికో వెళ్లిపోతాడు. ఆహ్లాదకర ప్రకృతితో కలిసి గడుపుతూ, తన కంటికి కనిపించిన సౌందర్యాన్ని.. కెమెరా కంటితో బంధిస్తాడు. రమణీయ దృశ్యాలు, అందమైన పక్షులు, జంతువులను మరింత అందంగా ఫొటోలు తీస్తూ కనికట్టు చేస్తున్నాడు.

ఆసక్తితో నైపుణ్యాలకు పదును...

బడి, కాలేజీ.. ఇలా ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా.. ఫోటోలు తీసే బాధ్యత అరుణ్‌దే. 2ఏళ్ల క్రితం నిజామాబాద్‌లో బీడీఎస్ పూర్తిచేసిన అరుణ్...ఆ సమయంలోనే ఫొటోగ్రపీపై మరింత ఆసక్తి పెంచుకున్నాడు. నైపుణ్యాలను సానబెట్టుకున్నాడు. అరుణ్ ఆసక్తి గమనించిన స్నేహితులు … కెమెరా బహుమతిగా ఇవ్వడంతో, ఊరూరా తిరిగి, మంచి చిత్రాలను క్లిక్ చేయడమే పనిగా పెట్టుకున్నాడు.

సహజత్వం ఉట్టిపడేలా...

వైద్యుడిగా బిజీ జీవితం గడుపుతున్నా...ఫోటోగ్రఫీపై ఏమాత్రం మక్కువ తగ్గలేదు అరుణ్‌ కు. తీసే ప్రతి ఫొటోలో సహజత్వం ఉట్టిపడేలా జాగ్రత్తపడ్డాడు. మనుషుల కన్నా, ప్రకృతికి సంబంధించిన ఫొటోలే ఆసక్తిగా తీస్తానని చెప్తున్నాడు. ఇలా కష్టపడుతూ...స్థానికంగా కొద్దికాలం లోనే ఉత్తమ నేచర్ ఫొటోగ్రాఫర్‌గా గుర్తింపు, అవార్డులు, రివార్డులు సొంతంచేసుకున్నాడు.

అంతర్జాతీయ స్థాయిలో ...

అరుణ్ తీసిన చెట్టుపై చీమ ఫొటో బీబీసీ ఎర్త్‌కు ఎంపికైంది. 35 అవార్డులు అందుకున్నాడు. 2 సార్లు అంతర్జాతీయ స్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో పాల్గొన్నాడు. నేషనల్ జియోగ్రఫీ ఇండియా, నేషనల్ జియోగ్రఫీ వరల్డ్‌వైడ్, వైల్డ్‌లైఫ్ ఇండియా, యాపిల్ సంస్ధలు అరుణ్ తీసిన ఫొటోలను వివిధ సందర్భాల్లో ఎంపిక చేశాయి. స్థానిక పార్కులో తీసిన ఓ కీటకం ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో చూసిన యాపిల్ సంస్థ...అరుణ్ అనుమతితో అధికారిక అకౌంట్‌లో పోస్ట్ చేసింది.ఫొటోగ్రఫీకి సమయం కేటాయిస్తూనే...పాటల రచయితగానూ గుర్తింపు కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు అరుణ్. విడుదలకు సిద్ధంగా ఉన్న 8 సినిమాలకు 23 పాటలు రాశాడు. దాదాపు 40 ప్రైవేటు ఆల్బమ్స్‌కు లిరిక్స్ రాసి, ఆల్‌రౌండర్‌గా సత్తా చాటుతున్నాడు.

చదువైనా, క్రీడలైనా, అభిరుచి ఉన్న ఏరంగంలోనైనా...ప్రావీణ్యత సంపాదిస్తే ఆ ఆనందం వేరు. అలా చేస్తేనే నిజమైన ఆత్మసంతృప్తి లభిస్తుంది . వైద్యుడిగా కొనసాగుతూనే.....ప్రకృతి, పర్యావరణం, వన్యప్రాణులపై మరింత అద్భుత ఫొటోలు తీసి, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడమే నా లక్ష్యం.

---------------------------------------- అరుణ్ కుమార్ ( భూపాలపల్లి యువకుడు )

ఇదీ చదవండి:ప్రేమలేనిదే జీవించలేమని.. ప్రేమికుల ఆత్మహత్య

Last Updated : Jun 20, 2021, 2:05 PM IST

ABOUT THE AUTHOR

...view details