KTR Speech on World Environment Day 2023 : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో తెలంగాణ రీ-థింక్ హబ్‌ను ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ రీ-థింక్ హబ్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం అనంతరం ఎన్విరాన్మెంటల్ సర్వైలెన్స్ ల్యాబ్‌ను మంత్రి తన చేతుల మీదుగా ఓపెన్ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తో పాటు రిటైర్ట్ ఐఏఎస్, ఏఎస్సీఐ ఛైర్మన్ పద్మనాభయ్య పాల్గొన్నారు.
Re Think Day on every Saturday in Telangana : ప్రారంభోత్సవాల అనంతరం మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. పర్యావరణ పరిరక్షణ గురించి.. పర్యావరణ హితానికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణ.. దేశంలోని అనేక రంగాలకు దిక్సూచిగా మారిందని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో హైదరాబాద్ అగ్రభాగానఉందని.. ఈ విషయాన్ని కేంద్రమే చెప్పిందన్న ఆయన.. గ్లోబల్ సిటీగా మారాలంటే మరింత పని చేయాల్సి ఉందని తెలిపారు. పరిపాలనలో ప్రజల భాగస్వామ్యం లేకుంటే మార్పు సాధ్యం కాదన్న ఆయన.. రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్ అనే ట్రిపుల్ ఆర్ మంత్రంతో పర్యావరణ పరిరక్ష సాధ్యమని వెల్లడించారు. ప్రజలు ఈ మంత్రాన్ని పాటించాలని.. ప్రతి శనివారాన్ని రీథింక్ రోజుగా పాటిద్దామని కేటీఆర్ పిలుపునిచ్చారు.
'తెలంగాణ.. దేశంలోని అనేక రంగాలకు దిక్సూచిగా మారింది. పర్యావరణ పరిరక్షణలో అగ్రభాగాన ఉన్నామని కేంద్రమే చెప్పింది. గ్లోబల్ సిటీగా మారాలంటే మరింత పని చేయాల్సి ఉంది. పరిపాలనలో ప్రజల భాగస్వామ్యం లేకుంటే మార్పు సాధ్యం కాదు. రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్ అనే ట్రిపుల్ ఆర్ మంత్రం ఉంది. ప్రజలు కూడా రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్ మంత్రం పాటించాలి. ప్రతి శనివారాన్ని రీథింక్ రోజుగా పాటిద్దాం.' - మంత్రి కేటీఆర్
ప్రతి శనివారం ఆర్‌ఆర్‌ఆర్‌కు పిలుపునిద్దాం..: రాష్ట్రవ్యాప్తంగా భారీగా మొక్కలు నాటి.. వాటిని రక్షించుకునేందుకు చర్యలు చేపడతామని కేటీఆర్ తెలిపారు. ప్రతి గ్రామంలోనూ నర్సరీ ఏర్పాటు చేస్తామన్నారు. పట్టణ, పంచాయతీరాజ్ చట్టంలో గ్రీన్ బడ్జెట్ పెట్టిన రాష్ట్రం మనదేనన్న కేటీఆర్.. ప్రత్యామ్నాయాలు వచ్చాక ప్లాస్టిక్ నిషేధానికి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో వెట్ వేస్ట్ ద్వారా రూ.200 కోట్ల ఆదాయం వస్తుందని.. సోలార్ ఉత్పత్తిలో దేశంలో రెండో స్థానంలో ఉన్నామని వివరించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వంపై విమర్శలు చేయడం చాలా సులభమని.. పక్క రాష్ట్రాలకు వెళ్లి చూస్తే తెలంగాణలో ఏముందో తెలుస్తుందని మంత్రి వ్యాఖ్యానించారు. పర్యావరణహితం కోసం ప్రతి శనివారం ఆర్‌ఆర్‌ఆర్‌కు పిలుపునిద్దామని స్పష్టం చేశారు.