తెలంగాణ

telangana

ETV Bharat / state

దంగల్ అమ్మాయిలు - WOMENS DAY

దంగల్‌ సినిమాలో గీత, బబితలు అబ్బాయిలను కుస్తీ పోటీల్లో మట్టికరిపిస్తారు. మన హైదరాబద్‌లో కొంత మంది అమ్మాయిలకు ఇప్పుడదే స్ఫూర్తిగా మారింది. రెజ్లింగ్‌లో దేశానికి బంగారు పతకాలు తీసుకురావాలనే లక్ష్యంతో కఠోర సాధన చేస్తున్నారు. దేశం కోసం ఓ 'పట్టు' పడుతున్న ఈ కుస్తీ అమ్మాయిలపై ఈటీవీ భారత్‌ ప్రత్యేక కథనం.

దంగల్ అమ్మాయిలు

By

Published : Mar 8, 2019, 2:23 PM IST

Updated : Mar 8, 2019, 6:07 PM IST

దంగల్ అమ్మాయిలు
దంగల్‌... బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం. ప్రముఖ కుస్తీ క్రీడాకారుడు మహావీర్ సింగ్‌ పోగాట్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. తాను సాధించలేని లక్ష్యాన్ని మ్యాట్‌ మీద తన కూతుళ్ల ద్వారా సాధించి దేశానికి బంగారు పతకం తీసుకొచ్చిన ఓ పల్లెటూరి తండ్రి కథ. సినిమా రూపంలో వచ్చిన ఈ చిత్రం ఎంతో మంది ఆడపిల్లల తల్లిదండ్రుల్లోస్ఫూర్తి నింపింది. చదువులతో పాటు క్రీడా రంగంలోనూ పిల్లలనూ ప్రోత్సహించడం పెరిగింది. ఈ చిత్రం ఇచ్చిన ప్రోత్సాహం, తల్లిదండ్రుల్లో మార్పుతో... హైదరాబాద్‌లోని కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి మైదానంలో కుస్తీ నేర్చుకునే బాలికల సంఖ్య పెరిగింది.

పిల్లలు సెల్‌ఫోన్‌ ఆటలకే ప్రాధాన్యమిస్తున్న ప్రస్తుత కాలంలో.. ఈ బాలికలు రోజూ ఉదయం, సాయంత్రం 4 గంటల పాటు సాధన చేస్తున్నారు. 14 ఏళ్ల వయస్సులోనే శిక్షణ పొందుతున్నారు. రెజ్లింగ్ శిక్షకుడు నందకిశోర్ గోకుల్‌ ఆధ్వర్యంలో 12 మంది అమ్మాయిలు కుస్తీ పోటీలకు సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే అండర్-14లో ముగ్గురు అమ్మాయిలు రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధించారు. కుస్తీ నేర్చుకోవడం వల్ల తమలో ఉన్న భయాందోళనలు దూరమయ్యాయని... ధైర్యంగా సమాజంలో బతుకవచ్చనే భరోసా కలుగుతుందని ఈ అమ్మాయిలుధీమా వ్యక్తం చేస్తున్నారు.

నగరానికి చెందిన అజ్జు, ప్రశాంతి దంపతుల ఇద్దరు కుమార్తెలు శ్రావణి, లోచితలను శిక్షణకు పంపిస్తున్నారు. పరిస్థితుల కారణంగా తాను రాణించలేకపోయానని.... తన కలను పిల్లలు సాకారం చేస్తారన్న నమ్మకం ఉందని అజ్జు ధీమాగా ఉన్నాడు.

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణలో 2 దశాబ్దాలుగా సేవలందిస్తోన్న రెజ్లింగ్ శిక్షకుడు నందకిశోర్‌ గోకుల్... చాలా మంది నిరుపేద ఆడపిల్లలకు ఈ క్రీడలో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. కుస్తీపై ఉత్సాహం ఇలాగే కొనసాగితే.. రాబోయే రోజుల్లో మన రాష్ట్రం నుంచి కూడా అంతర్జాతీయ స్థాయిలో పేరు తీసుకొచ్చే క్రీడాకారులు తయారవుతారనిపిస్తోంది.

ఇవీ చూడండి:ప్రోత్సహిస్తే రె'ఢీ'

Last Updated : Mar 8, 2019, 6:07 PM IST

ABOUT THE AUTHOR

...view details