ఈఎస్‌ఐ మందుల కొనుగోలు కుంభకోణంలో ప్రధాన నిందితురాలు దేవికారాణి కొల్లగొట్టిన మొత్తంపై ఏసీబీ దృష్టి సారించింది. ఆమె ఐఎంఎస్ సంచాలకురాలిగా నియమితురాలైన తర్వాత కూడబెట్టిన అక్రమాస్తుల విలువ వంద కోట్లుకు పైగానే ఉంటుందని ఇటీవలే విచారణ అధికారులు లెక్కగట్టారు. పీఎంజే నగల దుకాణంలోనే 7.3 కోట్ల విలువైన వజ్రాభరణాలు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. అంతేకాకుండా బాలాజీ సిద్ది, అమర్సన్, కోల్‌కతా, శ్రీపెర్ల తదితర నగల దుకాణాల్లోనూ నగలు కొన్నట్లు వెల్లడైంది. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయనే విషయం దర్యాప్తు అధికారులకు అంతుచిక్కడం లేదు.
ఎక్కడున్నాయనేది తేల్చడం...
ఆమెతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు, బినామీల ఇళ్లపై నిర్వహించిన దాడుల్లో కిలోన్నర ఆభరణాలను మాత్రమే ఏసీబీ గుర్తించగలిగింది. సుమారు ఏడు కోట్ల విలువైన ఆభరణాలు ఎక్కడున్నాయనేది తేల్చడం ఏసీబీ ముందు సవాలుగా మారింది. ఈ సందర్భంగా విచారణ అధికారులు లోతుగా దృష్టి సారించారు. ఆభరణాలను ఎవరి వద్దైనా దాచారా, విక్రయించారా అనే కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు.