తెలంగాణ

telangana

ETV Bharat / state

పరువూ దక్కలేదు... పైసలూ పోయె!

2018లో ఏవీ రమణదీక్షితులు, ఎంపీ విజయసాయిరెడ్డిపై తితిదే అధికారులు రూ. 200 కోట్ల పరువునష్టం దావా వేశారు. ఇందుకోసం కోర్టులో రూ. 2 కోట్లు ధరావతు కూడా చెల్లించారు. అనంతరం ఏపీలో ప్రభుత్వం మారడం వల్ల కొత్త ధర్మకర్తల మండలి ఏర్పాటైంది. కొత్త ఛైర్మన్ వద్ద పరువునష్టం దావా విషయం ప్రస్తావనకు రాగా... తాము దాన్ని ఉపసంహరించుకున్నామని ప్రకటించారు. తితిదే చెల్లించిన రూ.2 కోట్లనూ వదులుకుంటామన్నారు.

ttdp withdraw defamation suit
ttdp withdraw defamation suit

By

Published : Oct 25, 2020, 9:24 AM IST

ఇద్దరిపై తితిదే అధికారులు రూ. 200 కోట్లకు పరువునష్టం దావా వేశారు. దాని కోసం ముందస్తుగా రూ. 2 కోట్ల ధరావతును కోర్టులో చెల్లించారు. అది ఇంకా కోర్టులో తేలకముందే రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. దావా వేసినప్పటి ఈవోనే ఆ తర్వాతా కొనసాగారు. కానీ, దేవస్థానం పరువుకు నష్టం కలగలేదనుకున్నారో ఏమో.. దావా ఉపసంహరించుకుంటామని చెప్పారు.

అందుకోసం తాము ముందుగా చెల్లించిన రూ. 2కోట్ల ధరావతును వదులుకోడానికీ సిద్ధపడ్డారు! ఈ వ్యవహారంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధానార్చకులుగా ఉన్న ఏవీ రమణదీక్షితులు ఆలయంలో పింక్‌ డైమండ్‌ మాయమైందని ఆరోపిస్తూ... తితిదే తీరును అప్పట్లో తప్పుబట్టారు. ఇదే అంశంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అప్పటి తితిదే ఛైర్మన్‌, నాటి నుంచి ఇటీవలి వరకూ ఈవోగా ఉన్న అనిల్‌కుమార్‌ సింఘాల్‌ దీనిపై గట్టిగా స్పందించారు. తితిదే ప్రతిష్ఠకు భంగం కలిగించారంటూ 2018లో ఒక్కొక్కరిపై రూ. 100 కోట్ల చొప్పున రూ. 200 కోట్లకు పరువునష్టం దావా వేశారు. ఇందుకోసం న్యాయస్థానంలో రూ. 2 కోట్ల ధరావతు చెల్లించారు. ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. దీంతో భవిష్యత్తులో తితిదేపై ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేసేందుకు ఎవరూ సాహసించరని భావించారు.

అలా మారిందో లేదో..

ఏపీలో సర్కారు మారగా కొత్త ధర్మకర్తల మండలి ఏర్పాటైంది. రమణ దీక్షితులును ఆగమ సలహామండలి సలహాదారుగా నియమించారు. ఈ సమయంలోనే గతంలో తితిదే వేసిన పరువునష్టం దావా విషయాన్ని కొత్త ఛైర్మన్‌ వద్ద ప్రస్తావించగా, తాము దాన్ని ఉపసంహరించుకుంటామని ప్రకటించారు. దావాను విరమించుకుంటున్నట్లు తిరుపతిలోని పదో అదనపు జిల్లా కోర్టులో తాజాగా తితిదే తరఫున పిటిషన్‌ వేశారు. చెల్లించిన రూ.2 కోట్లనూ వదులుకుంటామన్నారు. ఈ నిర్ణయంపై పలు విమర్శలు వెల్లువెత్తాయి. తితిదే కోర్టుకు చెల్లించిన రూ.2 కోట్లను ధర్మకర్తల మండలి సభ్యుల నుంచి వసూలు చేయాలని ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి, రాయలసీమ పోరాట సమితి కన్వీనర్‌ నవీన్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

ఇదీ తీర్మానం..

తితిదే గతంలో దాఖలు చేసిన పరువునష్టం దావా ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోవాలంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో ధర్మకర్తల మండలి తీర్మానం చేసింది. ఇందులోని అంశాలు..‘‘తితిదే ప్రతిష్ఠకు భంగం కలిగించారని పేర్కొంటూ 2018 జూన్‌ 6న చేసిన తీర్మానాన్ని అనుసరించి తితిదే మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు, ఎంపీ విజయసాయిరెడ్డిపై తలో రూ. 100 కోట్లకు తిరుపతిలోని మూడో అదనపు న్యాయస్థానంలో దావా దాఖలు చేశారు. (ప్రస్తుతం ఈ దావా పదో అదనపు న్యాయస్థానంలో ఉంది). ఇందుకు అనుగుణంగా నోటీసులు జారీ చేయగా.. వారిద్దరూ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. తాము ఎన్నడూ తితిదే ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరించలేదని తెలిపారు. తమకు శ్రీవేంకటేశ్వరస్వామిపై నమ్మకం ఉందని, అందువల్ల తమపై వేసిన పరువునష్టం దావాను ఉపసంహరించుకోవాలని కోరారు. దీనిపై ధర్మకర్తల మండలి సమావేశంలో చర్చించారు. తితిదేకు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయలేదని వారు పేర్కొన్నందున కోర్టులో వేసిన దావాను ఉపసంహరించుకోవాలని పేర్కొంటూ ఫిబ్రవరి 29న జరిగిన ధర్మకర్తల మండలిలో తీర్మానం చేశారు. దీనికి అనుగుణంగా తితిదే న్యాయవిభాగంఅధికారి న్యాయస్థానంలో దాఖలు చేసిన దావాను ఉపసంహరించుకునేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేస్తూ తీర్మానించారు’’.

ఇదీ చూడండి:దసరా వేళ బస్సులు లేక ప్రయాణికులు ఇక్కట్లు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details