తెలంగాణ

telangana

By

Published : Jul 18, 2020, 8:35 PM IST

ETV Bharat / state

శ్రీవారి దర్శనాల కొనసాగింపుపై తితిదే పునరాలోచన

కరోనా మహమ్మారి మరింత విజృంభిస్తున్న వేళ... ఆంధ్రప్రదేశ్​లోని తిరుమల శ్రీవారి దర్శనాల కొనసాగింపుపై తితిదే పునరాలోచనలో పడింది. అర్చకులు సహా శ్రీవారి కైంకర్య నిర్వాహకులు సైతం కరోనా బారిన పడుతుండటం వల్ల దర్శనానికి వస్తున్న భక్తుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతుండటంపై తితిదే సమీక్ష జరుపుతోంది. దర్శనాల కొనసాగింపుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.

ttd-reviews-on-srivari-dharshan-in-corona-situation
శ్రీవారి దర్శనాల కొనసాగింపుపై తితిదే పునరాలోచన

లాక్‌డౌన్‌ సమయంలో దాదాపు 80రోజులపాటు ఏపీలోని తిరుమల శ్రీవారి దర్శనాలను నిలిపివేసిన తితిదే... ఆంక్షల సడలింపు తర్వాత పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించింది. రోజుకు 6వేల మందితో మొదలు పెట్టి.. ప్రస్తుతం రోజుకు 12 వేల మందికి శ్రీవారి దర్శనం కల్పిస్తోంది. ఇటీవల తిరుపతిలో వైరస్‌ శరవేగంగా విస్తరిస్తోంది. రోజుకు 200కు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఆలయ అర్చకులు, లడ్డూ పోటు కార్మికులు, కైంకర్యాల పర్యవేక్షకులు సహా తితిదే సిబ్బంది 140మంది ఈ వైరస్‌ బారినపడ్డారు. కరోనా వ్యాప్తి మరింత ఎక్కువగా ఉండటంతో శ్రీవారి దర్శనాల కొనసాగింపు విషయంలో తితిదే పునరాలోచనలో పడింది. రోజుకు 12వేల మందికి దర్శన టికెట్లు జారీ చేస్తున్నా వైరస్‌ కారణంగా వీరిలో చాలావరకు తిరుమలకు రావడం లేదు. కొండపైకి వస్తున్న భక్తుల సంఖ్య కూడా రోజురోజుకూ తగ్గిపోతుండటాన్ని పరిగణనలోకి తీసుకున్న తితిదే దర్శనాల కొనసాగింపుపై సమీక్షిస్తోంది.

శ్రీవారి దర్శనాల కొనసాగింపుపై తితిదే పునరాలోచన

పరీక్షలు నిర్వహించిన తర్వాతే...

భక్తుల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టిన తితిదే... అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద కొవిడ్ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన తర్వాతే కొండపైకి అనుమతిస్తోంది. తితిదే ఉద్యోగులకు సైతం ర్యాండం పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎన్ని జాగ్రత్తలు చేపట్టినా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం, కైంకర్యాలు నిర్వహించే అర్చకులకు సైతం వైరస్‌ సోకటంతో దర్శనాలు నిలిపివేయాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. ఆలయ గౌరవ ప్రధానార్చకులు రమణ దీక్షితులు సైతం ఇదే అంశాన్ని ట్విట్టర్‌ ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వివిధ పార్టీల నుంచి సైతం ఇదే తరహా స్వరం వినిపిస్తుండటంతో దీనిపై ఒక నిర్ణయం తీసుకునేలా తితిదే ప్రణాళికలు రచిస్తోంది.


ఇదీ చూడండి :రాష్ట్రంలో 42 వేలు దాటిన కరోనా కేసులు.. 400పైగా మరణాలు

ABOUT THE AUTHOR

...view details