TSPSC Group 2 Exam Arrangements :తెలంగాణలో గ్రూప్-2 రాతపరీక్ష (Group 2 Exam) షెడ్యూల్ ప్రకారం జరుగుతుందా? లేదా మరోసారి వాయిదా పడుతుందా? అనే విషయమై నిరుద్యోగుల్లో సందిగ్ధం నెలకొంది. ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసిన 5.51 లక్షల మంది టీఎస్‌పీఎస్సీ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన గ్రూప్-2 పరీక్షను 2024-జనవరిలో నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నిర్వహించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాచరణ మొదలు పెట్టింది.
Government Review on Group 2 Exam : గ్రూప్-2లో 783 పోస్టులతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గత సంవత్సరం ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులు స్వీకరించింది. రాష్ట్రవ్యాప్తంగా 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. తొలుత ఆగస్టు 29, 30న గ్రూప్-2 పరీక్ష నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ షెడ్యూల్ జారీ చేసింది. వరుసగా గురుకుల నియామక పరీక్షలు, గ్రూప్-1, 4 పరీక్షలతో పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేందుకు సమయం లేనందున గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు.
గ్రూప్-2 పరీక్షలు నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు :ఈ మేరకు గ్రూప్-2 పరీక్షలను నవంబరు 2, 3 తేదీలకు రీ షెడ్యూల్ చేసింది. అయితే నవంబరు 3 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో టీఎస్‌పీఎస్సీ ఈ పరీక్షలను మళ్లీ 2024 జనవరి 6, 7 తేదీలకు రీ షెడ్యూల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్-2 పరీక్షలు నిర్వహించేందుకు పరిపాలన పరమైన ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా పరీక్ష కేంద్రాలు గుర్తించేందుకు వీలుగా జిల్లా కలెక్టర్లకు లేఖలు రాసింది. గ్రూప్-1, గ్రూప్-2తో పాటు ఇతర నియామక పరీక్షల తాజా పరిస్థితిపై ఇప్పటికే వివరాలు తీసుకున్న రాష్ట్ర సర్కార్ త్వరలో సమీక్ష నిర్వహించనుంది. ఈ సమీక్షలో గ్రూప్-2 పరీక్ష నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశాలున్నట్లు తెలిసింది.