తెలంగాణ

telangana

By

Published : Jun 27, 2021, 5:11 PM IST

ETV Bharat / state

Anjan kumar: తెలంగాణ వద్దన్న వాళ్లే ఇప్పుడు మంత్రులయ్యారు: అంజన్​ కుమార్ యాదవ్​

టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​గా అవకాశం ఇచ్చినందుకు పార్టీ అధిష్ఠానానికి అంజన్​ కుమార్​ యాదవ్​ ధన్యవాదాలు తెలియజేశారు. పార్టీ సంక్షేమానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్​ను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేస్తారు. ఈ మేరకు హైదరాబాద్​లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

anjan kumar yadav press meet
అంజన్న కుమార్​ యాదవ్​

తెలంగాణ వద్దన్న వాళ్లే ఇప్పుడు మంత్రులయ్యారని సికింద్రాబాద్ మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ అంజన్‌ కుమార్ యాదవ్‌ ధ్వజమెత్తారు. బంగారు తెలంగాణ ఇప్పుడు అప్పుల తెలంగాణ అయిందని ఆక్షేపించారు. భాజపా, తెరాస రెండూ ఒకటేనని.. రెండు పార్టీలు తోడు దొంగలేనని ఆయన తెలిపారు. సోనియా గాంధీ ఎవరిని అధ్యక్షుడిగా చేస్తే వారితో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు.

బలోపేతం చేస్తాం

రాష్ట్రంలో కాంగ్రెస్​ను బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని అంజన్న స్పష్టం చేశారు. తాను సామాన్య కార్యకర్త నుంచి ఈ స్థాయికి వచ్చానని గర్వంగా చెప్పారు. కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తేవడమే తమ కర్తవ్యమని స్పష్టం చేశారు. తనకు వర్కింగ్ ప్రెసిడెంట్​గా అవకాశం ఇచ్చిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలకు ధన్యావాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. పీసీసీలో బడుగులకు ప్రాధాన్యత ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్​ పార్టీకి అధికారం ఇవ్వాలని అంజన్​ కుమార్​ యాదవ్​ రాష్ట్ర ప్రజలను కోరారు.

'ఆనాడు సోనియా గాంధీ లేకపోతే ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ ఉండేది కాదు. తెలంగాణ వచ్చినప్పుడు మిగులు బడ్జెట్​తో ఉన్న రాష్ట్రాన్ని.. తెరాస అధికారంలోకి వచ్చి అప్పుల పాలు చేసింది. కాంగ్రెస్​ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి కేటాయించిన నిధులను వీళ్లు కొల్లగొడుతున్నారు.'

-అంజన్​కుమార్​ యాదవ్​, టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​

తెలంగాణ కోసం కొట్లాడిన ఎంపీలంతా పదవులకు దూరమయ్యారని అంజన్​ కుమార్​ ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్​ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రజలకు తెరాస మోసాలపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పార్లమెంటులో జరిగిన సంగతులను వివరిస్తామని వెల్లడించారు.

తెలంగాణ వద్దన్న వాళ్లే ఇప్పుడు మంత్రులయ్యారు: అంజన్​ కుమార్ యాదవ్​

ఇదీ చదవండి:'అన్ని వర్గాల మహిళా సంక్షేమానికి తెరాస ప్రభుత్వ కృషి'

ABOUT THE AUTHOR

...view details