వలస కార్మికులను సొంతూర్లకు పంపించేందుకు సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ పోలీసులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నా క్షేత్రస్థాయిలో కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. ఒక్కో సవాలును దాటుకుంటూ అడుగు ముందుకేస్తూ క్షేమంగా రైలెక్కిస్తున్నారు. మమ్మల్ని ఎప్పుడు పంపిస్తారంటూ పోలీస్ స్టేషన్ల వద్ద వరుస కడుతున్న వేలాది మందిని ఓపికగా సముదాయిస్తున్నారు.
చివరి నిమిషం వరకు ఆందోళన..
మూడు కమిషనరేట్ల పరిధిలో బిహార్, ఝార్ఖండ్, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బంగా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా తదితర రాష్ట్రాలకు చెందిన సుమారు 2 లక్షల మంది వరకు వలస కార్మికుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఒక్కో రైలులో 1200 మంది వరకు సొంతూర్లకు పంపిస్తున్నారు. ఎవరెవర్ని పంపించాలో సాఫ్ట్‌వేర్ సాయంతో లాటరీ నిర్వహించి ఎంపిక చేస్తున్నారు. ఆ జాబితా కమిషనరేట్ నుంచి సాయంత్రం సంబంధిత ఇన్‌స్పెక్టర్‌కు చేరుతుంది. చివరి నిమిషం వరకు ఆ జాబితాలో ఉన్న కార్మికుల జాడ చిక్కడం లేదు. ఫోన్లు స్విచ్ఛాఫ్ వస్తున్నాయి. మరికొందరేమో క్యాంపులు, పునరావాస కేంద్రాల్లో కనిపించడం లేదు. ఇంకొందరేమో కాలినడకన బయలుదేరారు. ‘8 మందిని రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లేందుకు రాత్రి ఆర్టీసీ బస్సు పీఎస్ దగ్గరి కొచ్చింది. ముగ్గురి జాడనే చిక్కింది. అన్ని పనులు వదిలేసి వెతికినా మిగిలిన అయిదుగురు ఎక్కడున్నారో తెలియరాలేదు’ అని ఓ ఇన్‌స్పెక్టర్ వాపోయారు. ‘మా పీఎస్ నుంచి 40 మందిని పంపించాలని ఆదేశాలొచ్చాయి. సుమారు 70 నుంచి 80 లేబర్ క్యాంపుల్లో వెతికినా 13 మంది జాడ చిక్కలేదు’ అంటూ మరో ఇన్‌స్పెక్టర్ వివరించారు.