SEC Railway station rampage: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ పక్కా ప్రణాళిక ప్రకారమే రైల్వే స్టేషన్‌ను ధ్వంసం చేశారని ఎస్పీ అనురాధ వెల్లడించారు. దాడుల్లో పాల్గొన్న 46 మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశామని తెలిపారు. యువకులపై రైల్వే కేసులు నమోదైతే ఉద్యోగాలకు అనర్హులవుతారని ఆమె స్పష్టం చేశారు. సికింద్రాబాద్‌లో ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆందోళనలో పాల్గొన్న వారంతా ఆర్మీ దేహధారుడ్య పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారని ఎస్పీ వెల్లడించారు. ఆర్మీ అభ్యర్థులను కొన్ని శిక్షణ కేంద్రాలు తప్పుదారి పట్టించాయని పేర్కొన్నారు. ఈ నెల 16న వాట్సప్ గ్రూప్‌లు రూపొందించుకుని కుట్ర చేశారని తెలిపారు. రైల్వే ఆస్తులు ధ్వంసం చేయాలని ప్రణాళిక రచించుకున్నారన్నారు.
సికింద్రాబాద్ స్టేషన్‌పై దాడిని ఊహించలేదని.. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నామని ఎస్పీ అనురాధ స్పష్టం చేశారు. రైల్వే స్టేషన్‌లో ఆయిల్, ఇంజిన్లకు మంటలంటుకుంటే భారీ విధ్వంసం జరిగి ఉండేదని వెల్లడించారు. భారీ ప్రమాదాన్ని నివారించడానికే కాల్పులు జరపాల్సి వచ్చిందని పేర్కొన్నారు. రైల్వే రక్షక దళం పోలీసులు 20 రౌండ్ల కాల్పులు జరిపారని అనురాధ తెలిపారు.