తెలంగాణలో జులై 29న ఏటూరునాగారంలో, అక్టోబరు 3న తాడ్వాయి అడవుల్లో, అక్టోబరు 31న ఇంద్రవెల్లి అటవీప్రాంతంలో పులి చర్మాలు పట్టుబడ్డాయి. స్మగ్లర్లు చర్మం, గోర్లను అమ్మకానికి పెట్టడాన్నిబట్టి ఉద్దేశపూర్వకంగానే చంపినట్లు స్పష్టమవుతోంది. తాజాగా దొరికిన చర్మం ఏడాదిక్రితం ఉచ్చులో చిక్కుకుని మరణించిన మగ పులిదిగా తేలింది. అంటే పులి కనిపించకుండాపోయి, హత్యకు గురై ఏడాది దాటినా అటవీశాఖ అధికారులు గుర్తించలేకపోయారన్నది సుస్పష్టం. ఇదే కాదు ఫాల్గుణ సహా ‘కె’సిరీస్‌లో కొన్ని పులుల జాడ కనిపించడం లేదు. ‘పెద్దపులి ఏ ప్రాంతంలో ఉంది? ఎటువైపు వెళుతుంది? అనేది తెలుసుకునేలా నిత్యం దాని కాలిజాడలను ట్రాక్ చేయాలి. అవసరమైనప్పుడు ప్రత్యేక బృందాలు ఉండాలి. కెమెరా ట్రాప్‌లతో పరిశీలించాలి. ఒక్కరోజు గుర్తులు దొరక్కపోతే నిద్ర పట్టేదికాదు. అది కనిపించేదాకా గాలించేవాళ్లం. ఇప్పుడా పరిస్థితి లేదు’ అని పేరు చెప్పడానికి ఆసక్తి చూపని ఓ అధికారి ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘నాలుగేళ్లకోసారి కేంద్రం అధికారికంగా ప్రకటించే లెక్కలు మినహాయించి రాష్ట్ర అటవీశాఖ అధికారులు పెద్దపులుల సంఖ్య, అవి ఏ ప్రాంతంలో ఉన్నాయనే విషయాలు వెల్లడించడం లేదు. అసలు ఆ సమాచారం వారి వద్ద ఉందో లేదో కూడా తెలియదని’ ఆయన అభిప్రాయపడ్డారు.
చిత్రాల్ని తిప్పేశ్వర్‌కు పంపించాం
ఇంద్రవెల్లిలో దొరికిన చర్మాన్ని పరిశీలించాం. అది మూడేళ్ల వయసు మగ పులిదని నిర్ధారణయింది. ఇక్కడి పులుల ఫొటోలతో అది సరిపోలలేదు. మహారాష్ట్రలో తిప్పేశ్వర్ టైగర్ రిజర్వులోనిదై ఉంటుందని అనుమానిస్తున్నాం. చర్మం సహా ఇతర నమూనాల ఫొటోలను అక్కడి అధికారులకు పంపించాం.
-శాంతారాం, డీఎఫ్‌వో, ఆసిఫాబాద్