The state is top of the country in debt: అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి 6 నెలల కాలానికి ఏ రాష్ట్రమూ తీసుకోని రుణాలను ఆంధ్రప్రదేశ్ తీసుకుంది. ప్రతి నెలా కాగ్ వెలువరించే లెక్కల ఆధారంగా ఈ విషయం తేలింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏడాది మొత్తం మీద 48,724.12 కోట్ల రుణం అవసరమవుతుందని ప్రభుత్వం అంచనాలు రూపొందించింది.
సెప్టెంబరు నెలాఖరు వరకు ఏకంగా 49,263.34 కోట్ల రుణాన్ని రాష్ట్రం వినియోగించుకుంది. బిహార్ ఒక్కటే ఏడాది మొత్తం మీద 25,885.10 కోట్ల రుణం అవసరమవుతుందని ప్రతిపాదించి.. తొలి 6 నెలల్లో 30,407.14 కోట్ల రుణాన్ని సమీకరించింది. ఈ లెక్కలను పరిగణనలోకి తీసుకున్నా ప్రతిపాదిత అప్పు, వినియోగించిన అప్పు విషయంలో ఆంధ్రప్రదేశ్ ముందుంది.
తమిళనాడు 96,613.71 కోట్ల రుణం అవసరమని ప్రతిపాదించి ఇంతవరకు 18,726.34 కోట్లే అప్పు రూపంలో ఖర్చు చేసింది. కర్ణాటక, తెలంగాణ.. ఇలా అనేక రాష్ట్రాలు ఈ స్థాయి అప్పులు చేయలేదు. ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, ఎస్పీవీల ద్వారా తీసుకున్న రుణాల అసలు, వడ్డీని రాష్ట్ర బడ్జెట్ నుంచిగానీ, రాష్ట్రానికి వచ్చే పన్నుల ద్వారాగానీ చెల్లిస్తే.. వాటిని రాష్ట్ర ప్రభుత్వ రుణాలుగానే పరిగణిస్తామని.. కేంద్రం ఇదివరకే స్పష్టంచేసింది.
ఒకవైపు ఏపీఎస్‌డీసీ, బేవరేజస్ కార్పొరేషన్ రుణాలను రాష్ట్ర మొత్తం రుణాల్లో చేర్చడం లేదు. బేవరేజస్ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న 8,300 కోట్ల రుణం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తీసుకున్నదే. ఆర్థిక సంఘం, కేంద్ర ఆర్థికశాఖ లెక్కల ప్రకారం.. ఈ రుణాన్ని ప్రభుత్వ రుణంగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రం ఈ కార్పొరేషన్ల లెక్కలు కాగ్‌కు తెలియజేయడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రం కాగ్‌కు సమర్పించిన 49,263 కోట్ల రుణం కన్నా ఇంకా ఎక్కువే ఉంటుందనేది బహిరంగ రహస్యం..
ఇవీ చదవండి: