కేంద్రంలో భాజపా దూకుడుకు కళ్లెం వేసే దిశలో కార్యకలాపాలను విస్త్రృతం చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. రాష్ట్రాల్లో పీసీసీ కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేసి పాలనాపరమైన అంశాలపై ప్రత్యేక ప్రతినిధుల ద్వారా అవగాహన కల్పించనుంది. ఇవాళ గాంధీభవన్‌లో జరగనున్న పీసీసీ కార్యవర్గ సమావేశంలో అధిష్ఠానం తరఫున ఇద్దరు ప్రతినిధులు హాజరై వివిధ అంశాల గురించి వివరించనున్నారు. మరోవైపు రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, త్వరలో జరగనున్న పుర ఎన్నికల అంశం కూడా సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.
ముఖ్య నాయకులతో ప్రత్యేక జట్టు ఏర్పాటు:
భాజపా రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత.. ఆ పార్టీ దూకుడుకు కళ్లెం వేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. ఏఐసీసీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ బాధ్యతలు చేపట్టిన అనంతరం వివిధ అంశాలకు చెందిన నిపుణులతో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. కేంద్ర ప్రభుత్వంలో పాలనాపరమైన లోపాలను గుర్తించి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. 17 మంది ప్రత్యేక సలహాదారులను సోనియా నియమించారని.. వివిధ అంశాలపై వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటున్నట్లు కాంగ్రెస్ పేర్కొంది. వారి సలహాల ఆధారంగా అన్ని రాష్ట్రాల్లో పీసీసీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమైన నాయకులతో కేంద్ర పాలనాపరమైన లోపాలతో పాటు ఆర్థిక మాంద్యం, నిరుద్యోగం, పరిశ్రమల మూసివేత తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నారు.