మహారాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న సందిగ్ధం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే జరిగిన శాసనసభ ఎన్నికల్లో భాజపాకు పూర్తిస్థాయి మెజారిటీ రాకపోవడం.. మిత్రపక్షం శివసేనపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పీఠాన్ని చెరో సగం పదవీకాలం పంచుకోవాలంటూ డిమాండ్ చేయడం మరాఠా రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొనేందుకు కారణమైంది.
ఈ నేపథ్యంలో తమ డిమాండ్‌ను సమర్థించుకుంది శివసేన. భాజపా అధ్యక్షుడు అమిత్ షా- తమ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే మధ్య ఒప్పందం(ముఖ్యమంత్రి పీఠాన్ని చెరి సగం పదవీకాలం పంచుకోవాలి) కుదిరిందని.. ఈ విషయంపై భాజపా సత్యం మాట్లాడాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కోరారు.
"రాముడిని భాజపా నిత్యం స్మరిస్తుంది. రామ మందిరాన్ని నిర్మించేది భాజపానే. సత్యానికి నిదర్శనం రాముడు. కాషాయ దళం దీనిపై(ముఖ్యమంత్రి పదవి) సత్యం మాట్లాడాలి. కాగితాన్ని చింపగలరు.. కానీ రికార్డులను తొలగించలేరు."
--- సంజయ్ రౌత్, శివసేన ఎంపీ.
ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, శివసేన సీనియర్ నేత దివాకర్ రౌటే.. గవర్నర్‌ను సోమవారం విడివిడిగా కలిశారు. ఇది జరిగిన కొద్ది సమయం తర్వాతే ... భాజపా సత్యం మాట్లాడాలంటూ డిమాండ్ చేశారు రౌత్.