అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీని హైకోర్టు తప్పుబట్టింది. అక్రమ నిర్మాణాల కూల్చివేత నోటీసులపై సివిల్ కోర్టు యథాతథస్థితి ఉత్తర్వులు జారీ చేసిందంటే.. అధికారులు చేతులెత్తేయాలని కాదని.. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన బాధ్యత జీహెచ్‌ఎంసీపై ఉందని స్పష్టం చేసింది. యధాతథస్థితి ఉత్తర్వులున్నందున నిర్మాణాల్లో జోక్యం చేసుకోలేదన్న జీహెచ్ఎంసీ వాదనను ధర్మాసనం తప్పుబట్టింది.
దీన్ని చూస్తే అక్రమ నిర్మాణదారులతో జీహెచ్ఎంసీ అధికారులు కుమ్మక్కైనట్లుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. యధాతథస్థితి ఉత్తర్వులంటే తదుపరి నిర్మాణాలను కొనసాగించుకోవాలని చేతులెత్తేయడం కాదని.. నిర్మాణాలను కొనసాగకుండా చూడాలని పేర్కొంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం రాధాకృష్ణనగర్, అత్తాపూర్‌లో అనీస్ ఫాతిమా, మహమ్మద్ ఆయాజ్ మన్సూర్‌లు మూడంతస్తుల అక్రమ నిర్మాణం చేపడుతున్నారంటూ 2018లో ఇచ్చిన వినతి పత్రంపై చర్య తీసుకోకపోవడాన్ని సవాలుచేస్తూ సిద్ధాపురం రాజారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు.
వినతి పత్రం ఆధారంగా అదే ఏడాది జారీ చేసిన నోటీసును పట్టించుకోకపోవడంపై మరో పిటిషన్ దాఖలుచేశారు. వీటిపై సింగిల్ జడ్జి విచారణ చేపట్టగా.. ప్రతివాదులు సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించి యథాతథస్థితి ఉత్తర్వులు పొండంతో జోక్యం చేసుకోలేదని జీహెచ్‌ఎంసీ చెప్పింది. ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదాన్ని ఈ కోర్టుకు తీసుకువచ్చి చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేశారంటూ పిటిషన్లను సింగిల్ జడ్జి కొట్టివేశారు. రాజారెడ్డి అప్పీళ్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీల ధర్మాసనం విచారణ చేపట్టింది. యథాతథస్థితి ఉత్తర్వులు కొనసాగించేలా చూడాలని అధికారులను ఆదేశించింది.