తెలంగాణ

telangana

By

Published : Apr 23, 2020, 4:59 AM IST

ETV Bharat / state

నేరుగా కలిసినవారికే కరోనా పరీక్షలు

కొవిడ్‌ 19 నిర్ధారణ పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాజిటివ్‌గా గుర్తించిన వ్యక్తితో నేరుగా కలిసిన వారికే (ప్రైమరీ కాంటాక్టు) పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకూ క్వారంటైన్‌ గడువు 14 రోజులు ఉండగా.. ఇకపై 28 రోజులకు పెంచాలని తాజా ఆదేశాల్లో స్పష్టం చేసింది.

కరోనా పరీక్షలు
కరోనా పరీక్షలు

కరోనా పాజిటివ్​ వచ్చిన వ్యక్తితో నేరుగా కలిసిన వారికే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాజిటివ్‌ వ్యక్తులతో మెలిగినట్లుగా సెకండరీ కాంటాక్టు వ్యక్తులను గుర్తించినా.. వారిలో లక్షణాలు లేకపోతే నిర్ధారణ పరీక్షలు చేయవద్దని ఆదేశాలు జారీచేసింది. ఇదే సమయంలో ఆ సెకండరీ కాంటాక్టు వ్యక్తులకు గుర్తింపు ముద్ర వేసి, కచ్చితంగా ఇళ్ల వద్దే స్వీయ నిర్బంధ పరిశీలన(క్వారంటైన్‌)లో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.

ఇప్పటి వరకూ క్వారంటైన్‌ గడువు 14 రోజులు ఉండగా... ఇకపై 28 రోజులకు పెంచాలని తాజా ఆదేశాల్లో స్పష్టం చేసింది. క్వారంటైన్‌లో ఉంటున్నవారు నిబంధనలను పాటిస్తున్నారో లేదో స్థానిక యంత్రాంగం నిరంతరం పరిశీలించాలని ఆదేశించింది. ఈ మేరకు చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల కలెక్టర్లకూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు.

రాష్ట్రంలో తొలి కరోనా వైరస్‌ కేసు గత నెల 2న వెలుగుచూసింది. ఆపై 12 రోజుల వరకూ ఒక్కటీ నమోదవలేదు. అనంతరం వరసగా కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఇండోనేసియా పౌరుల్లో కరోనా వైరస్‌ గుర్తింపు అనంతరం తీగ లాగితే మర్కజ్‌ ఉదంతం బయటపడింది. ఇక్కణ్నుంచి పరీక్ష విధానమే మారిపోయింది. మర్కజ్‌ ఉదంతం ముందు వరకూ పాజిటివ్‌ వ్యక్తి నేరుగా సన్నిహితంగా మెలిగినవారిలో మాత్రమే నిర్ధారణ పరీక్షలు నిర్వహించేవారు. అనంతర పరిణామాల్లో మర్కజ్‌ ప్రయాణికుల కేసులు ఒక్కొటొక్కటిగా వెలుగులోకి రావడం వల్ల... కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

దాదాపు 1,345 మంది మర్కజ్‌ ప్రయాణికుల్లో పరీక్షలు నిర్వహించగా, 237 మందిలో పాజిటివ్‌గా తేలింది. ఈ క్రమంలో నేరుగా కలిసి ఉన్న కుటుంబ సభ్యులు, సన్నిహితులనే కాక.. వీరితో కలివిడిగా ఉన్నవారికీ (సెకండరీ కాంటాక్టు) పరీక్షలు చేశారు. ఆయా కంటెయిన్‌మెంటు ప్రాంతాల్లో అనుమానిత లక్షణాలున్నవారిలో నమూనాలు సేకరించారు. దాదాపు 3,193 మందికి పరీక్షలు చేయగా, 537 మందికి వైరస్‌ ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. ఇలా ఇప్పటి వరకూ దాదాపుగా 18వేల పరీక్షలు చేసినట్లుగా వైద్యవర్గాలు చెప్పాయి. ఇందులో సెకండరీ కాంటాక్టు వ్యక్తులే సుమారు 6వేల మంది వరకూ ఉంటారని పేర్కొన్నాయి. ఇదే క్రమంలో పాజిటివ్‌ కేసుల సంఖ్యా పెరిగింది.

లక్షణాలు కనిపించకపోవడం వల్ల..

కరోనా వైరస్‌ లక్షణాలు సాధారణంగా 2-14 రోజుల వ్యవధిలో బయటపడతాయనే ఉద్దేశంతో ఇన్ని రోజులూ 14 రోజుల క్వారంటైన్‌ను అమలుచేస్తూ వచ్చారు. ఇటీవల కొన్ని కేసుల్లో లక్షణాలు లేకుండానే పరీక్షల్లో కరోనా బయటపడటం.. మరికొందరిలో 14 రోజుల వ్యవధి ముగిశాక లక్షణాలు కనిపించడం వంటివి జరిగాయి. సూర్యాపేటలో నమోదైన కేసుల్లో దాదాపు 90శాతానికి పైగా లక్షణాల్లేకుండా బయటపడినవే. ఈ క్రమంలో ఐసీఎంఆర్‌ తాజాగా క్వారంటైన్‌ మార్గదర్శకాల్లో మార్పులు చేసినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. తదనుగుణంగా స్వీయ నిర్బంధ పరిశీలన గడువును 28 రోజులకు పెంచుతూ తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాజిటివ్‌ వ్యక్తి ప్రైమరీ కాంటాక్టుల్లో నెగిటివ్‌ వచ్చినా 28 రోజులపాటు ఇంట్లోనే ఉండాలి. పాజిటివ్‌ వ్యక్తి పూర్తిగా కోలుకొని ఇంటికి వెళ్లినా.. మరో 14 రోజులపాటు స్వీయ నిర్బంధంలో ఉండాల్సిందేనని వైద్యవర్గాలు స్పష్టంచేశాయి.

  • వైద్యఆరోగ్య సిబ్బందిలో మాత్రం లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేస్తారు.

ఎవరికి పరీక్షలు చేయరంటే...

ప్రైమరీ కాంటాక్టుతో అంత సన్నిహితంగా మెలగకపోయినా ఒకేచోట కొంత సమయం గడిపినట్లుగా నిర్ధారిస్తే.. వారిలో ఎలాంటి లక్షణాలు లేనపుడు సదరు వ్యక్తులను ఇళ్లలో స్వీయనిర్బంధ పరిశీలనలో ఉంచుతారు. ఉదాహరణకు.. ఒకే అంతస్తులో మూడడుగుల ఎడం పాటిస్తూ, మాస్కులు ధరిస్తూ సమీప సీట్లలో 20 మంది పనిచేస్తున్నారనుకుంటే.. వారిలో ఒకరికి పాజిటివ్‌ అని తేలి, మిగిలినవారిలో లక్షణాలు లేకపోతే వారిని ఇళ్లలో క్వారంటైన్‌లో ఉండమంటారు. పరీక్షలు చేయరు.

పరీక్షలకు ప్రామాణికాలు...

కరోనా పరీక్షలు
  • పాజిటివ్‌ వ్యక్తి కుటుంబ సభ్యులు, ఇంట్లో పనిమనుషులు, ఆ వ్యక్తితో దగ్గరగా కూర్చుని పావుగంట కంటే ఎక్కువ సమయం గడిపినవారు ప్రైమరీ కాంటాక్టు పరిధిలోకి వస్తారు.
    కరోనా పరీక్షలు
  • ప్రైమరీ కాంటాక్టుతో సంబంధమున్న వ్యక్తుల్లో(సెకండరీ కాంటాక్టు) జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వీరికీ పరీక్షలు చేస్తారు.
  • అదే ఒక వ్యక్తికి పాజిటివ్‌గా నిర్ధారిస్తే అతడున్న గదిలోకి ఎక్కువసార్లు వెళ్లి, ఎక్కువ సమయం గడిపిన వ్యక్తులకూ పరీక్షలు నిర్వహిస్తారు.
    కరోనా పరీక్షలు
  • పాజిటివ్‌ వ్యక్తితో కలిసిన దాఖలాలున్న వారిలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నవారు, గర్భిణుల్లో లక్షణాలు లేకపోయినా నమూనాలు సేకరిస్తారు.

ఇదీ చూడండి:ఆరోగ్య సిబ్బంది రక్షణకై కేంద్రం ప్రత్యేక ఆర్డినెన్స్​

ABOUT THE AUTHOR

...view details