తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి జాతీయ పతాకావిష్కరణ చేశారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి, ప్రజాసంక్షేమానికి పాటుపడేందుకు ప్రభుత్వం పునరంకితమవుతోందని తెలిపారు. సొంత రాష్ట్రం ఏర్పడితే ఏ సమస్యలు తీరుతాయని ఆశించామో, ఆ సమస్యలన్నీ పరిష్కారం అవుతున్నాయని అభిప్రాయపడ్డారు. విద్యుత్, సాగునీరు, విద్య, వైద్య, పారిశ్రామిక, ఐటీ తదితర రంగాల్లో ఎంతో ప్రగతి సాధించామన్నారు.
అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన సీఎం
అంతకుముందు గన్ పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద సీఎం నివాళులర్పించారు. గవర్నర్‌ను కలిసి.. ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆరోగ్యంతో సంపూర్ణ జీవితం గడపాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్. భారత స్వాతంత్ర ఉద్యమం తర్వాత సుదీర్ఘ కాలం జరిగిన పోరాటంగా తెలంగాణ ఉద్యమం చరిత్రలో నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
బీఆర్కే భవన్‌లో ..
అసెంబ్లీ ప్రాంగణంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, అమరులకు నివాళులర్పించారు. బీఆర్కే భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ జెండా ఎగురవేశారు. సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో మంత్రి మల్లారెడ్డి, జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ బొంతు రామ్మోహన్, తెలంగాణ భవన్‌లో రాజ్యసభ సభ్యుడు కేశవరావు మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు.
సిరిసిల్లలోమంత్రి కేటీఆర్
సిరిసిల్లలో జరిగిన ఆవిర్భావ వేడుకల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో మంత్రి సబితారెడ్డి, సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు, మెదక్ కలెక్టరేట్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పతాకావిష్కరణ చేశారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో తెలంగాణ తల్లి విగ్రహానికి హోంమంత్రి మహమూద్ అలీ పూలమాలలు వేసి... నివాళులర్పించారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో మంత్రి గంగుల కమలాకర్, పెద్దపల్లిలో మంత్రి ఈటల రాజేందర్, మంచిర్యాల కలెక్టరేట్‌లో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ జాతీయ జెండాను ఎగురవేశారు.
భావోద్వేగానికి గురైన శ్రీనివాస్ గౌడ్
వరంగల్ గ్రామీణ జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన వేడుకల్లో మంత్రి ఎర్రబెల్లి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మహబూబాబాద్‌లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాఠోడ్, వరంగల్ పట్టణ జిల్లా కలెక్టరేట్‌లో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ భాస్కర్ పాల్గొని, అమరులకు నివాళులర్పించారు. ఖమ్మంలో పువ్వాడ అజయ్, నిజామాబాద్ కలెక్టరేట్‌లో మంత్రి ప్రశాంత్‌రెడ్డి త్రివర్ణ పతాకం ఆవిష్కరించారు. మహబూబ్‌నగర్‌లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్.... అమరుల త్యాగాలు గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు.
నాంపల్లిలోని హెచ్ఆర్సీ కార్యాలయంలో కమిషన్ ఛైర్మన్ జస్టిస్ చంద్రకుమార్, టీఎస్పీఎస్సీ కార్యాలయంలో కమిషన్ ఛైర్మన్ గంటా చక్రపాణి జాతీయ జెండా ఎగురవేశారు. హైదరాబాద్ మెట్రో రైల్ భవన్‌లో సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి జెండా ఎగురవేశారు.
ఇదీ చూడండి:సీఎం కేసీఆర్‌కి రైతన్న బహుమానం