Farmers Loan waiver Budget 2023- 24: సుసంపన్నమైన వ్యవసాయానికి ప్రతీకగా తెలంగాణ నేడు దేశానికి దిశా నిర్దేశనం చేస్తోందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న విధంగా రైతు సంక్షేమ విధానాలు.. తమ రాష్ట్రాలలోనూ అమలు చేయాలని రైతులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. రాష్ట్రం ఏర్పాటుకు ముందు పదేళ్ల వ్యవసాయం, వ్యవసాయ అనుబంధాల రంగాలకు అప్పటి ప్రభుత్వాలు కేవలం రూ.7994 కోట్ల నిధులు ఖర్చు చేయగా.. రాష్ట్రం ఆవిర్భవించినప్పటినుంచి 2023 జనవరి వరకు తెలంగాణ ప్రభుత్వం 1,91,612 కోట్లు.. అంటే 20 రెట్లు నిధులు అధికంగా ఖర్చు చేసిందని వివరించారు.
సాగురంగానికి ఈ బడ్జెట్‌లో రూ. 26,885 కోట్లు కేటాయిస్తున్నట్లు హరీశ్‌రావు తెలిపారు. ఒక్క రైతుబంధు పథకానికే.. రూ.15,075 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. రైతు బీమాకు రూ.1598 కోట్లు.. రైతు రుణమాఫీ పథకానికి.. పంటరుణాలు రూ.90,000 వరకు ఉన్న వారికి మాఫీ అయ్యేలా బడ్జెట్‌లో రూ.6385 కోట్లు కేటాయించినట్లు వివరించారు. ఆయిల్‌ఫామ్ సాగును ప్రోత్సహించేందుకు రూ.1000 కోట్లు కేటాయించామని వెల్లడించారు. దుక్కిన దున్నింది మొదలు పండిన ప్రతి గింజ కొనుగోలు వరకు.. రైతన్నకు కొండంత అండగా నిలువనున్నట్లు హరీశ్ రావు స్పష్టం చేశారు.