T Congress on Karnataka Results : రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాజకీయ పార్టీలు కసరత్తు మొదలు పెట్టాయి. క్షేత్ర స్థాయిలో నాయకులు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అధికార ప్రతిపక్షాలకు చెందిన నాయకులు ఇప్పటి నుంచే ఓటర్లను ఆకర్షించేందుకు.. ఏదొక కార్యక్రమం పేరుతో జనంలోకి వెళుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది.
9 డిక్లరేషన్లతో ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్: రైతు సమస్యలతో పాటు యువత సమస్యలపైనా పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఈ రెండింటిపై డిక్లరేషన్లు సైతం ప్రకటించింది. ఓబీసీ, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ తదితర మొత్తం 9 డిక్లరేషన్లు ఉంటాయని పీసీసీ స్పష్టం చేస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 17 నాటికి 9 డిక్లరేషన్ల ప్రకటనకు, మేనిఫెస్టో విడుదలకు రాష్ట్ర నాయకత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. మరోవైపు యువ డిక్లరేషన్ జనంలోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ ప్రకటనకు పీసీసీ సిద్ధమవుతోంది. కర్ణాటక ఎన్నికలపై సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా మౌనం పాటించారని భావిస్తున్న కాంగ్రెస్.. మెజారిటీ స్థానాలలో ఎంఐఎం పోటీ చేయకుండా నిలువరించి జేడీఎస్‌కు మద్దతు ఇచ్చినట్టు ఆరోపిస్తుంది.
ప్రతి అసెంబ్లీకి ఐటీఐ కళాశాల.. పార్లమెంట్‌కు పాలిటెక్నిక్ కాలేజ్: ఒకవైపు అప్పులతో అల్లాడుతున్న రాష్ట్రంలో కాంగ్రెస్ చేస్తున్న డిక్లరేషన్ల ప్రకటనలు అమలు చేసేందుకు ఆర్ధిక వనరులపై లోతైన అధ్యయనం చేస్తోంది. మేనిఫెస్టో కూడా ఆర్ధిక భారం పడకుండా ఉండేట్లు రూపకల్పన చేస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీకి ఒక ఐటీఐ కళాశాల, ప్రతి పార్లమెంట్ నియోజక వర్గానికి ఒక పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ప్రతి జిల్లాలో నైపుణ్యత పెంచేందుకు నైపుణ్య అభివృద్ధి కేంద్రాల ఏర్పాటు, ప్రతి ఏడాది జాబ్ క్యాలెండరు విడుదల, సెప్టెంబర్ 17న రాష్ట్ర స్వతంత్ర దినోత్సవాన్ని అధికారకంగా నిర్వహించనున్నట్లు పేర్కొంటుంది.
కర్ణాటకలో బీజేపీ కోసం సీఎం కేసీఆర్ పనిచేశారు: కేసీఆర్ బీజేపీ కోసం కర్ణాటక ఎన్నికల్లో పని చేశారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. కర్ణాటకలో హంగ్ వస్తే బీజేపీకి జేడీఎస్ మద్దతు ఇచ్చేట్లు కేసీఆర్ వ్యూహ రచన చేశారని.. అందుకే ఎం.ఐ.ఎం ఓట్లు చీలిస్తే జేడీఎస్‌కు నష్టం జరుగుతుందని భావించిన కేసీఆర్ వ్యహాత్మక మౌనం పాటిస్తున్నట్లు ఆయన విమర్శించారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని సర్వేలు చెబుతుండడంతో… ఫలితాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఊపు వస్తుందని రాష్ట్ర నాయకత్వం అంచనా వేస్తోంది. ఇప్పటికే ఒక ప్రణాళిక ప్రకారం రైతు, యువత తరఫున పోటీ చేస్తున్న పీసీసీ.. మరిన్ని కార్యక్రమాలు చేపడతూ ముందుకు వెళ్లేలా కసరత్తు చేస్తుంది. మరోవైపు ఔటర్ రింగ్ రోడ్డు అవినీతిపై దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయడంతో పాటు సీఎం సలహాదారు సోమేశ్‌కుమార్ నియామకంపై న్యాయ పోరాటం చేయాలని పీసీసీ నిర్ణయించింది.
ఇవీ చదవండి: