వరి సాగు మానేయమని రైతులకు చెబుతున్న వ్యవసాయశాఖ మరో తీవ్ర నిర్ణయం తీసుకుంది. అన్నదాతలకు వరి విత్తనాలు అమ్మవద్దని ప్రైవేటు విత్తన కంపెనీలకు ఆదేశాలు జారీచేసింది. మంగళవారం విత్తన కంపెనీల ప్రతినిధులతో వ్యవసాయ కమిషనర్ రఘునందన్‌రావు సమావేశం నిర్వహించి ఈ మేరకు ఆదేశాలిచ్చారు.
వడ్లు కొనబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో.. వరి సాగు తగ్గించాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపడుతోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ సాగు తగ్గించాల్సిందేనని పట్టుదలగా ఉన్న సర్కారు.. వరి విత్తనాలు అమ్మవద్దని ఆదేశాలు జారీ చేసింది. యాసంగిలో వరి సాగు వల్ల నష్టం వచ్చే అవకాశాలున్నందున వాటిని అమ్మకుండా ఇతర పంటల విత్తనాలను మాత్రమే అందుబాటులో ఉంచాలని కంపెనీలకు ఆదేశాలిచ్చింది. పల్లి, శనగ, పెసర, ఆముదం, పొద్దుతిరుగుడు, నువ్వులు, ధనియాలు తదితర విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని వ్యవసాయ కమిషనర్ రఘునందన్‌రావు పరిశ్రమలకు స్పష్టం చేశారు.
టీఎస్ సీడ్స్ మాటేమిటి..
ప్రతి సీజన్‌లో రైతులకు అమ్మడం కోసం టీఎస్ సీడ్స్ పలు రకాల విత్తనాలను భారీగా సేకరించి సిద్ధం చేస్తుంది. ప్రస్తుతం వరి విత్తనాలే 2 లక్షల క్వింటాళ్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. రైతులు పండించిన విత్తన పంట కొని శుద్ధిచేసి, నిల్వ ఉంచేందుకు కోట్లు ఖర్చు చేసింది. వ్యవసాయ కమిషనర్ ప్రైవేటు కంపెనీలకు చెప్పినట్లుగా వరి విత్తనాల అమ్మకాలు మానేస్తే టీఎస్ సీడ్స్ ఇప్పటికే సిద్ధం చేసినవాటిని ఏం చేస్తారనేది ప్రశ్న. వాటిని సాధారణ పంట మాదిరిగా అమ్మితే నష్టం వస్తుందని అధికారులు అంటున్నారు. మరోవైపు పల్లి, శనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు వంటి పంటలు వేసేలా రైతులను ప్రోత్సహించేందుకు ఆ విత్తనాలనే అమ్మాలని ప్రైవేటు కంపెనీలకు రఘునందన్‌రావు చెప్పారు. ఆయన పర్యవేక్షణలో పనిచేస్తున్న టీఎస్‌సీడ్స్ వద్దే అలాంటి విత్తనాలు పెద్దగా లేకపోవడం గమనార్హం.
సూక్ష్మసేద్యం పథకానికి రూ. 121 కోట్లు విడుదల
రైతులకు రాయితీపై బిందు, తుంపర్ల సేద్యం పరికరాలను ఇచ్చే సూక్ష్మసేద్యం పథకానికి 121 కోట్లు విడుదల చేస్తూ ఉద్యానశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ పథకానికి ఈ ఏడాది బడ్జెట్‌లో 242 కోట్లు కేటాయించగా మొదటి 6నెలలకు అందులో సగం ఇస్తున్నట్లు తెలిపింది. అందుకు అనుగుణంగా వానాకాలం సీజన్‌కు ముందు ఇస్తే రైతులకు రాయితీలివ్వడానికి ఉపయోగపడేవి. కానీ.. తొలి 6నెలలు, వానాకాలం పంటల సీజన్ అయిపోయాక నిధుల విడుదలకు పరిపాలనా అనుమతినిస్తూ ఇప్పుడు ఉత్తర్వులిచ్చింది. కనీసం యాసంగిలోనైనా పరికరాలు ఇస్తారా? అని రైతులు ఎదురుచూస్తున్నారు.
ఇదీ చూడండి:Yasangi season in telangana: యాసంగిలో 52.80 లక్షల ఎకరాల్లో వరి సాగు!