తెలంగాణ

telangana

శివన్‌ అమ్మాయిలు... ఆటాడేస్తున్నారు!

By

Published : Oct 17, 2020, 11:58 AM IST

Updated : Oct 17, 2020, 12:12 PM IST

ఖరీదైన ప్రొటీన్‌ పౌడర్లలో కాకుండా ముతక గోధుమరవ్వలోనే వాళ్లు సత్తువని వెతుక్కుంటున్నారు... సౌకర్యవంతమైన సింథటిక్‌ ట్రాక్‌లు లేకున్నా...  కఠినమైన నేలపైనే అహర్నిశలూ సాధన చేస్తున్నారు...   ప్రొఫెషనల్‌ కోచ్‌లూ, బ్రాండెడ్‌ బూట్లూ, లక్షలు పెట్టే స్పాన్సర్లూ... ఇవన్నీ తెలీకపోయినా పతకాల పంట పండిస్తున్నారు.

special storuy on shivan sports girls in bihar
శివన్‌ అమ్మాయిలు... ఆటాడేస్తున్నారు!

బిహార్‌ రాజధాని పట్నాకి 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది శివన్‌. ఈ జిల్లాకి బాబూ రాజేంద్రప్రసాద్‌ స్వస్థలంగా తప్ప మరో ప్రత్యేకతే లేదు. భ్రూణహత్యలూ, బాల్యవివాహాలూ ఎక్కువగా ఉండే జిల్లాగా... మాత్రమే పేరు. అలాంటి శివన్‌ జిల్లా మరోసారి వార్తల్లోకి రావడానికి కారణం... ఆడపిల్లలే. అయితే ఈసారి దేశానికి స్ఫూర్తి నిచ్చేదిగా ఆ జిల్లా వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే, అక్కణ్నుంచి 30 మందికిపైగా అమ్మాయిలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు.

తల్లిదండ్రులు కాదన్నా...

సంజయ్‌ పాథక్‌... ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌. శివన్‌ జిల్లాలోని ‘లక్ష్మీపుర్‌’ ఆయన సొంతూరు. స్థానికులంతా ఆయన్ని ఆత్మీయంగా ‘మావూరి మహావీర్‌ సింగ్‌ ఫొగట్‌’ అంటుంటారు. కానీ ఆ ఊరి ఆడపిల్లలు మాత్రం ‘మాకు అంతకంటే ఎక్కువే. మహావీర్‌ సింగ్‌ ఆయన సొంత కూతుళ్లని మాత్రమే తీర్చిదిద్దారు. కానీ మా సార్‌...ఏ సంబంధమూ లేని మా అందరికీ అన్నీ ఆయనే అయ్యారు’ అని అంటారు ప్రేమగా. 2009లో తారాఖాటూన్‌, పుతుల్‌ కుమారి అనే ఇద్దరు మెరికల్లాంటి అమ్మాయిలు సంజయ్‌ దృష్టిలో పడ్డారు. ఆ పేదపిల్లలని కాస్త ప్రోత్సహించి జిల్లా స్థాయి పరుగు పోటీలకు పంపాడాయన. ఊహించినట్టుగానే ఆ అమ్మాయిలు బంగారు పతకాలు సాధించారు.

వాళ్ల మెడలో మెరిసిన స్వర్ణ పతకాలు సంజయ్‌లో గొప్ప సంకల్పానికి పునాది వేశాయి. ఆనాటి నుంచీ జీతంలో నాలుగోవంతు ఆ ఊళ్లోని ఆడపిల్లల్ని క్రీడాకారిణులుగా తయారుచేసేందుకు ఖర్చుపెడుతున్నారు. ఆ బాలికలు కూడా ఆయనిచ్చిన స్ఫూర్తిని నూటికి నూరు శాతం అందిపుచ్చుకున్నారు. మొదట్లో ఊరి చివర ఉన్న ప్రభుత్వ స్థలాన్ని చదును చేసుకుని అక్కడే ఫుట్‌బాల్‌తో మొదలుపెట్టి తమకు ఆసక్తి ఉన్న ఆటలని ఆడుకునేవాళ్లు. ఎందుకంటే ఏ ఆట నేర్పడానికీ వాళ్లకి కోచ్‌ ఎవరూ లేరు. వివిధ క్రీడలకు సంబంధించిన అంశాల్ని యూట్యూబ్‌లో చూసి వాటిని బాలికలకు నేర్పించడం మొదలుపెట్టారు సంజయ్‌. అలా అమ్మాయిలంతా నైపుణ్యాలు మెరుగుపరుచుకునేవారు. కానీ ఊళ్లోని కొంతమంది పోకిరీలు ఆడపిల్లలకి ఆటలేంటని ఆటంకాలు కలిగించేవారు. తల్లిదండ్రులు కూడా ‘అవును మరి. నిక్కర్లు వేయించి ఆడపిల్లలతో ఆడిస్తే ఇలానే అవుతుంది’ అంటూ సంజయ్‌పై ఎదురుదాడిచేశారు. ఆయన కూడా వెనక్కి తగ్గుదామనే అనుకున్నారు. కానీ అమ్మాయిలు మాత్రం ఎవరెన్ని చెప్పినా ఆటల్ని కొనసాగిస్తూనే వచ్చారు. దాంతో సంజయ్‌ రెట్టించిన ఉత్సాహంతో తనకున్న ఎకరం భూమినీ మైదానంగా మార్చేసి ‘రాణీ లక్ష్మీబాయి స్పోర్ట్స్‌ క్లబ్‌’ను ప్రారంభించారు. అక్కడో హాస్టల్‌నీ ఏర్పాటు చేశారు. ఆ మైదానమే క్రమంగా ‘శివన్‌’ బాలికల విజయాలకు వేదిక అయ్యింది. ఆ స్థలంలోనే ఫుట్‌బాల్‌, రగ్బీ, హాకీ, బ్యాడ్మింటన్‌ లాంటి క్రీడలతోపాటు అథ్లెటిక్స్‌లోనూ సాధన చేయడం మొదలుపెట్టారు. సాధారణంగా క్రీడాకారులు తీసుకునే పోషకాహారం వీళ్లకు అందని ద్రాక్షే. ప్రొటీన్లతో కూడిన ఆహారం అంటూ వీరికి ప్రత్యేకంగా ఏమీ ఉండదు. ఉదయంపూట గోధుమ రవ్వ ఉప్మా, వారానికోసారి అందించే గుడ్డు మాత్రమే వీరికందే పోషకాహారం. అయినా గొప్ప సంకల్పబలంతో బరిలోకి దిగుతుంటారు.

కుటుంబాలకి ఆర్థిక అండ...

సల్మాఖాతూన్‌ని ఊళ్లో ‘పీటీ ఉష’ అని పిలుస్తారు. రాష్ట్రస్థాయిలో ఎన్నో పతకాలు గెలుచుకుందామె. సల్మా అక్క తారా కూడా జాతీయస్థాయి క్రీడాకారిణే. వీళ్ల తండ్రి సుధాన్‌ అన్సారీ టైర్లకి పంక్చర్లు వేసుకుంటూ జీవనోపాధి పొందుతాడు. ఎవరెన్ని చెప్పినా బిడ్డల ఇష్టానికే విలువనిచ్చాడు. ఇప్పుడు సల్మా, తారా రైల్వేలో ఉద్యోగాలు సంపాదించి కుటుంబాన్ని పోషిస్తున్నారు. రాధాకుమారి జాతీయ హ్యాండ్‌బాల్‌ పోటీల్లో బంగారు పతకాన్ని సాధించింది. ఇప్పుడో స్కూల్లో పీఈటీగా పనిచేస్తూ... కుటుంబానికి అండగా నిలిచింది. భారత్‌ ఫుట్‌బాల్‌ జట్టులో రాణిస్తున్న నిషా కూడా ఇక్కడి అమ్మాయే. ఇదీ శివన్‌జిల్లాలో ఒక ఆడపిల్ల నుంచి మరో ఆడపిల్లకు అందుతున్న స్ఫూర్తి. వీళ్లకి కాస్తంత ప్రభుత్వ సాయం కూడా అందితే ఒలింపిక్స్‌లోనూ పతకాలు సాధిస్తామంటున్నారు నేటితరం ద్రోణాచార్యుడు సంజయ్‌.

ఇదీ చదవండిఃమీ పిల్లలను చిరుతిళ్ల నుంచి దూరం చేయండిలా..!

Last Updated : Oct 17, 2020, 12:12 PM IST

ABOUT THE AUTHOR

...view details