తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇదేం విచిత్రం.. ఖాళీగా కొందరు.. అదనపు బాధ్యతలతో మరికొందరు

Police department: రాష్ట్ర పోలీసుశాఖలో అంతా అయోమయ పరిస్థితి కనిపిస్తోంది. కొందరు అధికారులేమో ఖాళీగా ఉంటే.. ఒక్కో అధికారేమో మూడు, నాలుగు విభాగాల బాధ్యత నిర్వర్తిస్తున్నారు. మరికొందరికి అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో పోలీసుశాఖలో అంతా గందరగళంగా తయారైంది.

By

Published : Jun 12, 2022, 10:37 AM IST

Police department
పోలీసుశాఖలో విచిత్ర పరిస్థితి

Police department: రాష్ట్ర పోలీసుశాఖలో చిత్ర విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఒకపక్క అనేకమంది అధికారులు ఖాళీగా ఉండగా మరోపక్క ఒక్కో అధికారి మూడు, నాలుగు విభాగాల బాధ్యత చూస్తున్నారు. కొందరు పదోన్నతులు పొందిన తర్వాతా పాత పోస్టుల్లోనే కొనసాగడం ఆనవాయితీగా మారింది. వెరసి పోలీసుశాఖలో అయోమయ పరిస్థితి నెలకొంది.

వెయిటింగ్‌.. వెయిటింగ్‌

ఇదిలా ఉంటే మరోపక్క అనేక మంది అధికారులు పోస్టింగులు లేక వెయిటింగ్‌లో ఉన్నారు. కేంద్ర సర్వీసుల నుంచి వెనక్కు వచ్చిన అదనపు డీజీ విజయ్‌కుమార్‌కు హోంగార్డుల విభాగానికి ఎటాచ్‌మెంట్‌ చేశారు తప్ప రెగ్యులర్‌ పోస్టింగు ఇవ్వలేదు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని తూర్పు మండలం డీసీపీగా పనిచేస్తున్న రమేష్‌రెడ్డి డీఐజీగా పదోన్నతి పొంది రెండేళ్లు గడిచినా ఇంకా ఎస్పీ హోదాలో అక్కడే కొనసాగుతున్నారు. అలానే హైదరాబాద్‌ అదనపు కమిషనర్‌(సమన్వయం)గా పనిచేస్తున్న చౌహాన్‌ అదనపు డీజీగా పదోన్నతి పొందినప్పటికీ ఇంకా ఐజీ స్థాయి పోస్టులోనే పనిచేస్తున్నారు.

సూర్యాపేట ఎస్పీగా పనిచేసి గత అక్టోబరులో డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేసిన భాస్కరన్‌కు కూడా ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు. ఆయనను స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌కు ఎటాచ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ క్యాడర్‌కు అలాట్‌ అయిన అభిషేక్‌ మహంతిని సర్వీసులోకి తీసుకునేందుకు చాలాకాలం అంగీకరించలేదు. చివరకు న్యాయస్థానం ఆదేశాలతో రాష్ట్ర సర్వీసులోకి తీసుకున్నప్పటికీ ఆయనకు ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు. సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీగా పనిచేసిన విజయ్‌కుమార్‌ను ఆకస్మికంగా అక్కడ నుంచి బదిలీ చేసి డీజీపీ కార్యాలయానికి ఎటాచ్‌ చేశారు. ఆయనకు ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు. ఐపీఎస్‌ రంగారెడ్డితోపాటు కొత్తగా ఐపీఎస్‌లుగా పదోన్నతులు పొందిన పద్మజారెడ్డిని సీఐడీకి, సలీమాను రాచకొండకు, వికారాబాద్‌ ఎస్పీగా పనిచేసిన నారాయణను డీజీపీ కార్యాలయానికి ఎటాచ్‌ చేశారు. వీరందరికీ పూర్తిస్థాయి పోస్టింగులు ఇవ్వాల్సి ఉంది. కొత్త ఐపీఎస్‌ బ్యాచ్‌లకు చెందిన దాదాపు పది మంది అధికారులను రెండేళ్లపాటు గ్రేహౌండ్స్‌లోనే పనిచేయించడం అప్పట్లో పోలీస్‌శాఖలో చర్చనీయాంశం అయింది. కొద్దిరోజుల క్రితమే వీరికి స్థానచలనం కలిగించినా ఏఎస్పీలుగా అటాచ్‌మెంట్‌ మాత్రమే ఇచ్చారు.

బదిలీలు ఎప్పుడు?

ప్రస్తుతం పోలీసు శాఖలో ఉన్న ఈ సమస్యలను సరిదిద్దాలంటే బదిలీలు ఒక్కటే మార్గమని అంతర్గత భావన. అయితే పోలీసుశాఖలో పెద్దఎత్తున బదిలీలు ఉండవచ్చని చాలాకాలంగా జరుగుతున్న ప్రచారం వాస్తవంలోకి రావడంలేదు.

ఇవీ చదవండి:

Telangana Weather Updates : రేపు తెలుగు రాష్ట్రాలకు నైరుతి రాక..

వేధించిన యువకుడికి మహిళ చెప్పు దెబ్బలు.. అరగంట పాటు!

ABOUT THE AUTHOR

...view details