తెలంగాణ

telangana

ETV Bharat / state

పుచ్చతో... పుట్టెడు లాభాలు - WATER MELON DOSHA

కెంపురంగులో కంటికింపుగా కనిపించి ఊరుకోదు.. మండు వేసవిలో మంచులా పలకరించి వేసవితాపం నుంచి సాంత్వన కలిగిస్తుంది పుచ్చకాయ. అంతా నీరే అనిపించినా దానిలో పోషకాలు మనలో రోగనిరోధకశక్తిని పెంచి మనల్ని శక్తిమాన్‌లుగా మార్చేస్తాయి.

WATER MELON BENFITS
పుచ్చతో.. పట్టెడు లాభాలు

By

Published : Apr 26, 2020, 6:52 PM IST

పుచ్చకాయలో తొంభై శాతం నీరే ఉంటుంది. వేసవిలో పుచ్చకాయను తరచూ తీసుకుంటే శరీరానికి కావాల్సిన నీరు అందించి దేహం డీహైడ్రేట్‌ అయిపోయే ప్రమాదం నుంచి కాపాడుతుంది. ఎన్ని తిన్నా బరువు పెరిగిపోతామనే భయం లేదు. కారణం దీని నుంచి అందే కెలొరీలు తక్కువ. కప్పు పుచ్చకాయ ముక్కల నుంచి కేవలం 46 కెలొరీలు మాత్రమే లభ్యమవుతాయి.

నిరోధకశక్తిని పెంచుతాయి..

చెమట రూపంలో శరీరం ముఖ్యమైన మూలకాలని కోల్పోతుంటుంది. అందువల్లే నీరసం, నిస్సత్తువ ఆవరిస్తుంటాయి. అందుకే పుచ్చకాయని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోండి. దానిలోని పొటాషియం, మెగ్నిషియం, సోడియం, క్యాల్షియం వంటివి చెమట కారణంగా కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్‌ని భర్తీచేస్తాయి. విటమిన్‌-సి, ఎ, బి1, బి6 వంటివి రోగనిరోధకశక్తిని పెంచుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. దీంట్లో ఉండే లైకోపిన్‌ కొలెస్ట్రాల్‌, రక్తపోటును తగ్గిస్తుంది.

ఆకలి అదుపులో

ఒత్తిడిని దూరం చేసే పుచ్చకాయలో పీచు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అందుకే దీన్ని తింటే మనకి త్వరగా ఆకలి వేయదు. దాంతో బరువు అదుపులో ఉంటుంది. జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. మలబద్ధకం సమస్య ఉండదు.

మెరిసే చర్మానికి

దీంట్లో ఉండే ఎ, సి విటమిన్ల వల్ల జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి. విటమిన్‌-సి చర్మంలో కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది చర్మానికి పోషణ ఇవ్వడంతోపాటు వెంట్రుకలను దృఢంగా మారుస్తుంది. విటమిన్‌-ఎ చర్మకణాలను మరమ్మతు చేయడమే కాకుండా కొత్తకణాల వృద్ధికి తోడ్పడుతుంది. చర్మం నిర్జీవంగా, పొలుసుల్లా మారకుండా చూస్తుంది.

పుచ్చతో దోసెలు

కావాల్సినవి:

పుచ్చకాయ తొక్క ముక్కలు - రెండున్నర కప్పులు (వెలుపలి ఆకుపచ్చ తొక్క కాకుండా తెలుపు రంగులోనిది మాత్రమే తీసుకోవాలి), బియ్యం - కప్పు, కొబ్బరిపాలు - అర కప్పు, పచ్చికొబ్బరి తురుము - పావుకప్పు, అటుకులు - పావు కప్పు, ఉప్పు- తగినంత.

తయారీ విధానం:

ముందు బియ్యం, అటుకులను గంటసేపు నానబెట్టుకోవాలి. ఆ తరువాత నీటిని వడకట్టి, బియ్యం, అటుకులు, కొబ్బరిపాలు, పచ్చికొబ్బరి తురుము, పుచ్చకాయ ముక్కలు.. అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ దోసె పిండిలా రుబ్బుకోవాలి. దీనికి తగినంత ఉప్పు కూడా కలిపి పెట్టుకోవాలి. ఈ పిండిని రాత్రంతా పులియబెట్టాలి. తెల్లారి దోసెల్లా వేసుకోవడమే.పుదీనా, టమాట చట్నీతో తింటే వావ్‌ అనకుండా ఉండలేరు. చక్కని పోషకాలూ అందుతాయి.

ఇవీ చూడండి: 'కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం'

ABOUT THE AUTHOR

...view details