‘వర్షంలో తడవడం వల్ల జలుబు, దగ్గు, జ్వరం.. వంటి అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. తద్వారా మన శరీరంలో రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. ఈ సమయంలో కరోనాతో పాటు ఇతర వైరస్‌లు, ఇన్ఫెక్షన్లు మనల్ని త్వరగా అటాక్ చేస్తాయి. కాబట్టి బయటికి వెళ్లిన వారు.. తప్పనిసరిగా గొడుగు వెంటబెట్టుకొని వెళ్లాలి. ఇక రోజూ ఆఫీసులకు, ఇతర పనుల రీత్యా బయటికి వెళ్లిన వారు ఆ రోజు వర్షం పడినా, పడకపోయినా తమ హ్యాండ్‌బ్యాగ్‌లో ఓ చిన్ని గొడుగును తప్పనిసరిగా ఉంచుకోవాల్సిందే!
నీళ్లు గోరువెచ్చగా..!
వర్షాకాలంలో నీటి కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కలరా, విరేచనాలు, ఇతర జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి మనం తాగే నీరు ఫిల్టర్ అయినప్పటికీ వాటిని బాగా మరిగించుకొని గోరువెచ్చగా అయ్యాక తాగడం మంచిదంటున్నారు నిపుణులు. రోజుకు రెండుమూడు లీటర్లు తాగడం తప్పనిసరి.. అందులో నిమ్మరసం పిండుకుంటే రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఇలా గోరువెచ్చటి నీళ్లు తాగడం వల్ల శరీరంలో రక్తప్రసరణ కూడా సక్రమంగా జరుగుతుంది. అంతేకాదు.. గోరువెచ్చగా ఉండే నీళ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల కరోనాకు దూరంగా ఉండచ్చని ఇప్పటికే నిపుణులు వెల్లడించారు.
అదే మన రక్షణ కవచం!
కాలం మారుతున్న కొద్దీ మనం అప్రమత్తంగా ఉండకపోతే సీజనల్ వ్యాధులు అటాక్ చేయడానికి రెడీగా ఉంటాయి. మనం వాటికి ఆ అవకాశం ఇవ్వకూడదనుకుంటే రోగనిరోధక వ్యవస్థను దృఢంగా ఉంచుకోవడం. అది మనం రోజూ తీసుకునే ఆహారం వల్లనే సాధ్యమవుతుంది. ఇందుకోసం విటమిన్ ‘సి’ అధికంగా ఉండే కమలాఫలం, బత్తాయి, అరటి, కివీ.. వంటి పండ్లతో పాటు టొమాటో, ఆకుకూరలు, క్యాబేజీ.. వంటి కాయగూరల్ని రోజూ తీసుకోవాలి. ఆయా కాలాల్లో లభించే పండ్లు కూడా ఇన్ఫెక్షన్లను తట్టుకునే శక్తిని అందిస్తాయి. శరీరంలో రోగనిరోధక శక్తి మెండుగా ఉంటే సీజనల్ వ్యాధులే కాదు.. ప్రస్తుతం మన చుట్టూ ఉన్న కరోనా బారిన పడకుండా జాగ్రత్తపడచ్చు కూడా!