సంక్రాంతి పండుగకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపేందుకు సిద్ధమైంది. పండుగకు 4940 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు రంగారెడ్డి రీజనల్ మేనేజర్ వరప్రసాద్ వెల్లడించారు. జనవరి 10 నుంచి 13 వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌ల నుంచి ఏపీతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు బస్సుల ఆపరేషన్ ఉంటుందని ఆర్‌ఎం పేర్కొన్నారు. గతేడాది 4600 బస్సులను నడపగా 5 కోట్ల ఆదాయం వచ్చిందని వివరించారు. ఈ ఏడాది 6 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నామని వరప్రసాద్ తెలిపారు.
'అంతర్రాష్ట్ర బస్సులకే అదనపు ఛార్జీలు'
ఇంటర్ స్టేట్ సర్వీసులకు మాత్రమే అదనపు ఛార్జీలు వసూలు చేస్తామని... అందులోనూ రిజర్వేషన్ గల 1100 ప్రత్యేక బస్సులకే ఈ పెంపు వర్తిస్తుందని ఆర్‌ఎం స్పష్టం చేశారు. ఏపీతో పాటు బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు 1526 బస్సులు నడిపిస్తామన్నారు. విజయవాడ, విజయనగరం, తెనాలి, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, రాజోలు, పోలవరం, మచిలీపట్నం, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, విశాఖ పట్నం, శ్రీకాకుళం, భీమవరం, నర్సాపూర్, కర్నూల్, అనంతపురం, కడప, చిత్తూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, ఉదయగిరి, కనిగిరి, కందుకూరు, పామురు, పొదిలి తదితర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను సిద్ధం చేసినట్లు వరప్రసాద్ వివరించారు.